ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ!

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ!
  •  ఉమ్మడి జిల్లాలో ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్  
  •  6,111 మంది ఓటర్లు, 7 పోలింగ్ కేంద్రాలు
  •  సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్​, 144 సెక్షన్​ అమలు
  •  బల్క్​ ఫోన్​ కాల్స్​, ఎస్​ఎంఎస్​ లపై నిషేధం

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్​ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రంతో ప్రచార సమయం ముగియగా, రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 6,111 మంది ఓటర్లు ఉండగా, 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున పోలింగ్ స్టేషన్​ ఏర్పాటు చేశారు. ప్రచారానికి తెరపడడంతో వాయిస్​ కాల్స్, బల్క్​ ఎస్​ఎంఎస్​లపై కూడా నిషేధం ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీఎన్ఎస్ఎస్​యాక్ట్​ సెక్షన్ 163ను అమలు చేస్తున్నారు. ఇక 48 గంటల పాటు వైన్​ షాపులు, బార్లను కూడా మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ జిల్లా కేంద్రాల్లోని రిసెప్షన్​ సెంటర్​​నుంచి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రిని తీసుకొని వారికి డ్యూటీ కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. 

బరిలో 19 మంది...

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ప్రధానంగా ఐదుగురి మధ్యనే పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్​ మరోసారి పోటీలో ఉన్నారు. టీపీఆర్​టీయూ నేత హర్షవర్థన్​ రెడ్డి, పీఆర్​టీయూ టీఎస్​ నాయకుడు శ్రీపాల్ రెడ్డి, బీజేపీ మద్దతుతో పులి సరోత్తం రెడ్డి బరిలో ఉన్నారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి..? 
    
ఖమ్మం జిల్లాలో 4,089 మంది ఓటర్లు ఉండగా, అందులో 2,372 మంది పురుషులు, 1,717 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. వీరి కోసం 24 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఉండగా, ఖమ్మం అర్బన్​ మండలంలో మాత్రం రిక్కాబజార్​ స్కూల్​ లో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 మంది సెక్టార్​ అధికారులు, 24 మంది ప్రిసైడింగ్ అధికారులు, 24 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 48 మంది అదర్​ పోలింగ్ ఆఫీసర్లు, 24 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల డ్యూటీలో పాల్గొంటున్నారు. వీళ్లందరికీ ఇప్పటికే పోలింగ్ శిక్షణనిచ్చారు. 48 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, అదనంగా 20 శాతం బ్యాలెట్ బాక్సులను రిజర్వ్ లో 
ఉంచారు. 
    
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,022 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. వీరిలో 1,068 మంది పురుషులు, 954 మంది మహిళలున్నారు. పీవోలు 28 మంది, ఏపీవోలు 28, ఓపీవోలు  28 మందిని నియమించారు. నేడు రామచంద్ర ప్రభుత్వ డిగ్రీకాలేజీలో ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని తరలిస్తారు. గురువారం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ బాక్స్​ లను నల్గొండలోని తెలంగాణ వేర్​ హౌసింగ్ గోడౌన్​ లకు తరలించనున్నారు. మార్చి 3న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఎన్నికల నియమావళి పాటించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈనెల 27న సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండొద్దు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటాం. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశాం. ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. 

సునీల్ దత్, ఖమ్మం పోలీస్​ కమిషనర్​