ఎలక్షన్​ రూల్స్​ ఉల్లంఘిస్తే చర్యలు

ఎలక్షన్​ రూల్స్​ ఉల్లంఘిస్తే చర్యలు
  • జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు 
  • 200 పోలింగ్ కేంద్రాలు, 
  • 24,905 మంది ఓటర్లు 
  • ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ, వెలుగు : టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినందున వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో కోడ్ అమలులోకి వచ్చిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్​లో ఎస్పీ శరత్​చంద్ర పవార్​తో ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో  సమావేశం నిర్వహించారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవ‌‌‌‌రి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని,  ఫిబ్రవ‌‌‌‌రి 10న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ అని తెలిపారు.

 ఫిబ్రవ‌‌‌‌రి 11న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేష‌‌‌‌న్ల ఉప‌‌‌‌సంహ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవ‌‌‌‌రి 27న ఉద‌‌‌‌యం 8 నుంచి సాయంత్రం 4  గంటల వ‌‌‌‌ర‌‌‌‌కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 8న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. 

200 పోలింగ్ కేంద్రాలు, 24,905 మంది ఓటర్లు..

 డిసెంబర్ 30, 2024న ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు, 24,905 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో 4,483 మంది ఓటర్లు ఉన్నారని, 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

 రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని కోరారు. కోడ్ అమలులోకి వచ్చినందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్స్, కటౌట్లు, పోస్టర్లను వెంటనే తొలగించాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు పనిచేయాలని తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి వరంగల్, -ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై అడిషనల్ కలెక్టర్ రాంబాబుతో కలిసి వెబెక్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవ‌‌‌‌రి 27న ఉద‌‌‌‌యం 8 నుంచి సాయంత్రం 4 గంటల వ‌‌‌‌ర‌‌‌‌కు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,679 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో వీవీ అప్పారావు, డీపీవో నారాయణరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్​శ్రీనివాసరాజు, ఎలక్షన్ డీటీ వేణు తదితరులు పాల్గొన్నారు.