- నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నమోదు
- వచ్చే నెల 9 వరకు అభ్యంతరాల స్వీకరణ.. 25న తుది జాబితా విడుదల
నల్గొండ, వెలుగు : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న నల్గొండ, ఖమ్మం,- వరంగల్ శాసనమండలి టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అయింది. మొత్తం 22,254 మంది ఓటర్లతో కూడిన జాబితాను నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. గత నెలలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించగా ఈనెల 6 వరకు అవకాశం కల్పించారు. నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల నుంచి 28,698 మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా.. వీటిలో 6,114 రిజెక్ట్ చేశారు.
మిగిలిన 22,552 అప్లికేషన్ల లిస్ట్ సిద్ధం చేశారు. ఇందులో పురుషులు 13, 498 మంది, 9,056 మంది మహిళలు ఉన్నారు. ముసాయిదా జాబితాను ఆయా జిల్లాల్లోని తహసీల్దార్, ఆర్డీవో ఆఫీస్ ల్లో అందుబాటులో ఉంచుతారు. వచ్చే నెల 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 25 న తుది జాబితాను విడుదల చేస్తారు.
మరోసారి నమోదుకు చాన్స్
2019మార్చిలో నిర్వహించిన నల్గొండ - ఖమ్మం - వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ నుండి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఈ క్రమంలో ఓటర్ల నమోదు కొరకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 20,888 మంది ఓటర్లు ఉన్నారు
ప్రస్తుత ముసాయిదా జాబితా ప్రకారం చూస్తే ఈసారి 1,666 మంది ఓటర్లు పెరిగారు. కొత్తగా ఓటరు నమోదుకు మరోసారి చాన్స్ ఇవ్వడంతో ఇంకొందరు పెరగొచ్చు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య సైతం గతంలో కంటే రెట్టింపు అవుతున్నాయి. గత ఎన్నికల్లో 181 ఉండగా ఈదఫా 19 పోలింగ్ కేంద్రాలను కొత్తగా చేర్చి 200కు పెంచారు.
జిల్లా పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు
సిద్దిపేట 04 149
జనగాం 12 810
హనుమకొండ 15 4,424
వరంగల్ 13 1,923
మహబూబాబాద 16 1,270
భూపాలపల్లి 07 264
ములుగు 09 572
భద్రాద్రి 23 1,809
ఖమ్మం 24 3,862
యాదాద్రి 17 826
సూర్యాపేట 23 2,467
నల్గొండ 37 4,178
మొత్తం 20 22,554