టీచర్‌‌‌‌ ఆత్మహత్య.. అంత్యక్రియలను అడ్డుకున్న అప్పులోళ్లు

సూర్యాపేట/మునగాల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక గవర్నమెంట్​టీచర్​ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన గోదేశి నరేంద్రబాబు(52) జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ నగర్ లో నివాసముంటున్నారు.  గుంజులూరు ప్రభుత్వ బడిలో స్కూల్ అసిస్టెంట్ గా చేస్తున్నారు. భార్య ధనలక్ష్మి పెన్ పహాడ్ ప్రభుత్వ బడిలో టీచర్​గా చేస్తోంది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. నరేంద్ర బాబు గ్రామస్థులు, బంధువుల దగ్గర సుమారు రూ. 20 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం. అప్పులు ఇచ్చినవారు తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో భార్య పేరు మీద ఉన్న ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించాడు. ఇందుకు అతని భార్య అంగీకరించలేదు.

అప్పుల బాధ తాళలేక బుధవారం రాత్రి నరేంద్ర బాబు గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం కొడుకు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. నరేంద్రబాబు ఆత్మహత్య విషయం తెలుసుకున్న అప్పులు ఇచ్చిన బాధితులు వెంటనే విజయరాఘవపురం చేరుకొని కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. అప్పుల విషయం తేల్చేవరకు శవాన్ని కదలనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. నరేంద్రబాబు అప్పు తీసుకున్న డబ్బులను షేర్​మార్కెట్​లో పెట్టి నష్టపోయినట్లు తెలిసింది.