- ల్యాబ్‌లో జారిపడ్డానని చెప్పాలని బెదిరింపు
- స్కూల్‌కు వెళ్లి ఫర్నిచర్ధ్వంసం చేసిన పేరెంట్స్
- కరీంనగర్‌లోని శ్రీచైతన్య స్కూల్లో ఘటన
కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ వావిలాలపల్లి శ్రీ చైతన్య స్కూల్ లో 5వ తరగతి చదువుతున్న స్టూడెంట్ నోట్ బుక్ తెచ్చుకోలేదని తల పగలగొట్టిందో టీచర్. ఉడ్ డస్టర్ ను విసిరేయడంతో బాలుడి తలకు గాయమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన చందన్, కిరణ్మయి దంపతుల కొడుకు జయంత్.. వావిలాలపల్లి శ్రీచైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు.
ఎప్పటిలాగే శుక్రవారం స్కూల్‌కు వెళ్లిన జయంత్‌ను ఫస్ట్ పీరియడ్‌లో ఇంగ్లీష్ టీచర్ మహేశ్వరి.. నోట్‌బుక్ ఏదని అడిగింది. మర్చిపోయి వచ్చానని చెప్పడంతో ఆమె కోపంతో ఊగిపోయింది. చేతిలో ఉన్న ఉడ్డస్టర్ను విసిరేయడంతో బాలుడి తల పగిలి రక్తం వచ్చింది. దీంతో అక్కడే ఫస్ట్‌ఎయిడ్ చేశారు. ఇంటికి వెళ్లాక అడిగితే ల్యాబ్‌లో జారి పడ్డానని చెప్పాలని బెదిరించారు. మళ్లీ వారే 11 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి మీ అబ్బాయికి దెబ్బ తాకిందని చెప్పారు.
దీంతో వారు స్కూల్‌కు వెళ్లి మేనేజ్మెంట్ను ఏమైందని ప్రశ్నించగా సరైన సమాధానమివ్వలేదు. జయంత్‌ను అడగ్గా అసలు విషయం చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడి ఫర్నిచర్ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో స్కూల్ సిబ్బంది నెట్టివేయగా బాలుడి తల్లి కిరణ్మయి కిందపడి స్పృహ తప్పింది. తర్వాత పిల్లవాడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా మూడు కుట్లు వేశారు.
విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులపై దాడులు ఆపాలని, జయంత్‌ను గాయపరిచిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట ధర్నా చేశారు. త్రీ టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి జయంత్‌తో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.