
- టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష
- ఆర్థిక శాఖ నుంచి పలుమార్లు ఫైల్ రిటర్న్
- ప్రభుత్వ హామీ అమలు కాక అవస్థలు
హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దాదాపు 14 వేల మంది అంగన్వాడీలు రిటైర్ అయ్యారు. నేటికీ వారికి బెనిఫిట్స్ అందలేదు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని, టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయా (హెల్పర్)కు రూ.లక్ష ఇస్తామని ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు.
అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా .. కార్యరూపం దాల్చడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని మహిళా శిశు సంక్షేమశాఖ.. ఆర్థిక శాఖకు ఫైల్ పంపింది. నాలుగుసార్లు ఫైల్ పంపినా.. ఆ శాఖ క్లియర్ చేయకుండా తిరిగి మహిళా శిశు సంక్షేమ శాఖకు రిటర్న్ పంపించినట్లు తెలిసింది. ఆమోదం తెలపకుండా పంపడంతో ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయంలో ఉన్నారు.
వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. లభించని ఆమోదం..
గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్‌తో పాటు హెల్పర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు సేవలు అందిస్తున్నారు. అంతేగాకుండా, ప్రభుత్వ పథకాలు మొదలుకొని సర్వేల వరకు ప్రభుత్వ పని ఏదైనా వారికే అప్పగిస్తుంది. రాష్ట్రంలోని 37,500 అంగన్వాడీ కేంద్రాల్లో 70 వేల మంది టీచర్స్, హెల్పర్స్ పనిచేస్తున్నారు. ప్రతి ఏటా వేలల్లో రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్మెంట్ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్స్ కు రూ.50వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. వారు రిటైర్మెంట్ కాగానే వారికి బెనిఫిట్స్ ఇచ్చేదని పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెనిఫిట్స్ పెంచుతామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు నేటికీ ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన బెని ఫిట్స్నే కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 14వేలకు పైగా టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్ అయ్యారని తెలిసింది.
ఆయాలు 6 వేలు, టీచర్లు 8వేల మంది వరకు రిటైర్ అయ్యారు. వారందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉంది. ప్రభుత్వం బెనిట్స్ రిలీజ్ చేయకపోవడమా? లేకుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదా? అని తెలియడం లేదు. అంతేగాకుండా, 10వేల మంది వరకు వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. వారికి ఇప్పటికీ ఆమోదం లభించలేదని తెలిసింది.
హామీ అమలు కావడం లేదు
ఎన్నికల సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. రిటైర్మెంట్ అయినవారికి సైతం బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. కొంతమంది పనిభారం పెరగడంతో వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా ఆమోదించాలి. పనిభారం తగ్గించాలి. రిటైర్మెంట్ అయినవారికి బెనిఫిట్స్ ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నెలనెలా జీతాలు అందించాలి.- నిర్మల, టీఎన్జీవో అనుబంధ సంఘం (అంగన్వాడీ ఎంప్లాయీస్ యూనియన్) స్టేట్ కన్వీనర్