పిల్లలు మంచిగా ఎదగాలంటే ఇంట్లో, స్కూల్లో ఎలాంటి వాతావరణం ఉండాలి? తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్లతో ఎలా మాట్లాడాలి? చిన్నారుల టాలెంట్ని గుర్తించి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి? స్కూల్లో ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ నుంచి సొసైటీని అర్థం చేసుకునే వరకు.. వాళ్లను ఎలా తీర్చిదిద్దాలో తెలుసా..
పిల్లల మానసిక వికాసాన్ని ఎలా పెంచాలి?
పిల్లలు పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు మానసికంగా, శారీరకంగా డెవలప్ మెంట్ ఉంటుంది. ఇదే వాళ్ల తర్వాత జీవితాన్ని డిక్టేట్ చేస్తుంది. తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లలను అన్ని కోణాల్లో డెవలప్ చేస్తూ, వాళ్ల ఆలోచనలను గుర్తించి, ప్రశ్నలకు జవాబులు చెప్తూ పెంచగలిగితే పిల్లల్లో మానసిక ధైర్యం పెరుగుతుంది. అన్ని రకాల విలువలతో పెరుగుతారు. భవిష్యత్ కూడా బాగుంటుంది.
మ్యాజికల్ థింకింగ్ అంటే ఏంటి?
పిల్లల్లో రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఉండే ఆలోచనా పద్ధతిని 'మ్యాజికల్ థింకింగ్" అంటారు. ఈ వయసులో పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటారు. ప్రతి ఒక్కటీ తెలుసుకోవాలనుకుంటారు. ప్రతిదాన్ని సునిశితంగా అబ్జర్వ్ చేస్తారు. పిల్లలకు తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్లకొచ్చిన అనుమానాలు తీర్చాలి. అయితే మామూలుగా అవును, కాదు అని సమాధానాలు చెప్తే సరిపోదు.. వివరంగా ఉదాహరణలతో చెప్పాలి.
కథలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
పిల్లలకు కథలు చెప్పడం వల్ల వాళ్లలో క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఏర్పడుతుంది. విషయాన్ని నేరుగా కాకుండా కళాత్మకంగా వినడం వల్ల వాళ్లలో సంతోషం, ఆసక్తి కలుగుతాయి. కథల్లో ఉండే నీతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఎలా నడవాలో కథ ద్వారా గ్రహిస్తారు. కథ అర్థం కాకపోయినా, వాళ్లు అనుకున్న విధంగా కథ నడవక పోయినా.. మధ్యలో ప్రశ్నలు వేస్తారు. అలాంటప్పుడు ఓపిగ్గా విని, వాటికి జవాబులు చెప్పాలి.
చిన్నారుల్లో సోషల్ మెంటాలిటి ఎలా డెవలప్ చెయ్యాలి?
పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు అడ్డు చెప్పకూడదు. వాళ్లు చేస్తున్నది మంచి పనికాదనుకోండి. దాని వల్ల కలిగే నష్టాలు చెప్తే, వాళ్లే ఆపని ఆపేస్తారు. వాళ్లతో పనులు చేయించడంతోపాటు.. తల్లిదండ్రులు చేసే పనుల్లో వాళ్లనూ కలుపుకు పోవాలి. అలా చేస్తే వాళ్లలో మానసిక ఎదుగుదల కచ్చితంగా ఉంటుంది. ఇంటరాక్టివ్ డెవలప్ మెంట్ పెరగాలంటే.. కేవలం నాలుగు గోడల మధ్యే ఉంచకుండా.. మిగతా కుటుంబాలు, ఇతర పిల్లలు, పనులలో ఇన్వాల్వ్ చెయ్యాలి. దాంతో వాళ్లలో సోషల్ మెంటాలిటీ సులభంగా డెవలప్ అవుతుంది. సామాజిక జీవితం పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఏ పని చేయబోయినా 'చదువుకోపో.. నీకెందుకు ఇలాంటి పనులు' అని అడ్డుచెప్పడం వల్ల వాళ్లలో ఆత్మన్యూనత కలుగుతుంది.
స్కూల్లో ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ పిల్లల మానసిక ఎదుగుదలకు ఎంతవరకు ఉపయోగపడతాయి?
9 నుంచి 13 ఏళ్ల పిల్లల్లో క్రియేటివిటీకి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయసులో పిల్లలు సొంతంగా ఆలోచించేలా, వాళ్ల మానసిక ఎదుగుదలకు అనుకూలంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి. వాళ్ల మానసిక స్థాయిని అంచనా వేసి, అందుకు తగ్గట్టు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి. అంతేగానీ, అందరికీ ఒకే ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వకూడదు. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ సొంతంగా చెయ్యాలి. తల్లిదండ్రులు, టీచర్స్ కేవలం పర్యవేక్షిస్తే చాలు. అమ్మానాన్నలే అన్నీ చేసి పెడితే వాళ్లకు ఎలాంటి ఉపయోగం ఉండదు. పిల్లలు ఒక కొత్త వస్తువును సొంత ఆలోచనలతో తయారు చేసి, ఎలా చేశారు? ఎలా పనిచేస్తుంది? ఎందుకు ఉపయోగపడుతుంది? వివరంగా చెప్పగలిగితే.. వాళ్ల మానసిక అభివృద్ధికి ప్రాజెక్ట్ వర్క్ ఉపయోగపడుతుంది.
ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే పిల్లలకు ఉపయోగం?
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యామిలీ సిస్టమ్, విలువలు, నీతి... లాంటి సబ్జెక్ట్స్ అయినా ఇవ్వొచ్చు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఇవ్వొచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి. ఉదాహరణకు ట్రాఫిక్ సిస్టమ్ ఉంది. ట్రాఫిక్ ఎలా ఉంటే సమస్యలు రావు? అనేదాని గురించి పిల్లలకు ఇస్తే.. వాళ్లు బయటకు వెళ్లి సిటీలోని ట్రాఫిక్ సిస్టమ్ చూసి, తెలుసుకుంటారు. రోడ్డు ఎలా ఉండాలి? ఫుట్ పాత్ సైజ్ ఎంత ఉండాలి? సిగ్నల్స్ ఎలా ఉండాలి? సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? అన్నీ సొంతంగా తెలుసుకుంటారు. ఇది పిల్లలకు నిజమైన నాలెడ్జ్ ఇస్తుంది. పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపయోగపడేవే ప్రాజెక్ట్ వర్క్స్ ప్రాజెక్ట్ వర్క్స్ కు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో ఉండకూడదు. పిల్లలు వాటిని చూస్తే వాళ్లలో క్రియేటివిటీ పెరగదు. వాళ్లకు ఎలాంటి ఉపయోగం ఉండదు.
మోరల్ వాల్యూస్ పెంచడానికి ఏం చేయాలి?
ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఆర్ట్, క్రాఫ్ట్ , మోరల్ టీచర్స్ తప్పనిసరిగా ఉండాలి. థియేటర్ ఆర్ట్ ఉండాలి. పిల్లలను ఒక గ్రూపుగా చేసి.. అమ్మ, నాన్న, పిల్లలు, యజమానిగా, ఉద్యోగి... వంటి పాత్రలు వాళ్ల చేత వేయించాలి. ఇలాంటివన్నీ పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి ఉపయోగపడతాయి. పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలన్నా, మానసిక దృఢంగా ఏర్పడాలన్నా ఆటలు చాలా అవసరం. అందుకే గేమ్స్, స్పోర్ట్స్ పిల్లలకు నేర్పించాలి. వీటన్నింటితో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడే పిల్లలు సంపూర్ణంగా ఎదుగుతారు. వాళ్లలో అన్ని రకాల స్కిల్స్డెవలప్ అవుతాయి.
పిల్లల్లో ఛాలెంజింగ్ మెంటాలిటి పెంచడం లాభమా..నష్టమా..
ఛాలెంజింగ్ మెంటాలిటి వల్ల పిల్లల్లో పోటీతత్వం చెప్పడం వల్ల.. వాళ్లిద్దరి మధ్య అసూయ, ద్వేషం లాంటివి కలగొచ్చు. అందరి పిల్లల్లో ఒకే విధమైన టాలెంట్ ఉండదు. ఒకరికి ఆటలు, మరొకరికి చదువు, మరొకరికి క్రియేటివిటీ... ఇలా అనేక రంగాల్లో వాళ్లకి టాలెంట్ ఉండొచ్చు. అది తెలుసుకోకుండా పిల్లలందరికి ఒకే విషయం గురించి చాలెంజ్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మానసికంగా పిల్లల్లో పూర్తి ఎదుగుదల లేనప్పుడు ఇలాంటి చాలెంజ్లు ఇవ్వకూడదు. ఎందుకంటే.. వాళ్లలో ఉన్న టాలెంట్ తెలిసేదే 18 ఏళ్లు నిండిన తర్వాతే. అందుకే చిన్నప్పుడు చాలెంజ్ లు ఇచ్చి వాళ్లను ఆత్మన్యూనతకు గురిచెయ్యొద్దు. చిన్నప్పుడు చాలెంజ్ తీసుకుని ఫెయిల్ అయితే వాళ్లలో సంకుచిత స్వభావం ఏర్పడుతుంది. తోటి పిల్లల నుంచి దూరమవుతారు.
స్కూల్లో సెక్షన్స్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
పిల్లలను ఒకరు ఎక్కువ. మరొకరు తక్కువని విడదీయడం తప్పు. క్లాసులో బాగా చదివే పిల్లవాడ్ని పొగిడి, తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్లను తిడితే వాళ్లలో నెగిటివ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. సెక్షన్స్ ఏర్పాటు చేయడం కూడా ఇలాంటిదే. ఎక్కువగా స్కూళ్లలో బాగా చదివే పిల్లలను ఒక సెక్షన్లో, ఒక మాదిరిగా చదివే వాళ్లను మరొక సెక్షన్లో, సరిగా చదవని పిల్లలను ఒక సెక్షన్లో వేస్తారు. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదల పూర్తిగా లోపిస్తుంది. కొందరు ఆత్మన్యూనతకు లోనవుతారు. ఒకే క్లాస్లో ఎక్కువమంది పిల్లలు ఉంటే.. వాళ్లను గ్రూపులుగా విడగొట్టాల్సి వస్తే.. మార్కులు, ర్యాంకుల ప్రకారం కాకుండా.. ప్రతి గ్రూపులో అన్ని రకాల పిల్లలు ఉండేలా చూడాలి. గ్రూపులకు సైంటిస్టులు, నాయకులు, కవులు, పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తుల పేర్లు పెట్టాలి. ఎందుకంటే వాళ్లు సెక్షన్లో ఉండటం వల్ల ఆ గొప్పవ్యక్తుల గురించి తెలుసుకుంటారు. వాళ్ల ద్వారా ఉత్తేజితులవుతారు. అనుకరించడానికి ప్రయత్నిస్తారు. మంచి లక్షణాలను అలవర్చుకుంటారు.