టీసీల పేరుతో ‘సర్కార్’ టీచర్ల చేతివాటం

  • ఒక్కో టీసీకి రూ.200- నుంచి వెయ్యికి పైగా వసూళ్లు
  • పట్టించుకోని ఆఫీసర్లు

జగిత్యాల, వెలుగు : సర్కార్ స్కూళ్లలో అన్నీ ఉచితం అని ప్రభుత్వం చెబుతుంటే కొందరు టీచర్లు మాత్రం తమ చేతివాటం చూపుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేందుకు టీసీ తప్పనిసరి కావడంతో దీన్ని ఆసరాగా చేసుకుంటున్న టీచర్లు, హెచ్ఎంలు స్టూడెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటు పేరెంట్స్, అటు స్టూడెంట్స్ యూనియన్ లీడర్లు కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే షోకాజ్ నోటీసులు, మెమోలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నార్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఒక్కో టీసీకి రూ. 200 నుంచి రూ. 1000

కోరుట్ల మండలంలోని ఓ సర్కార్ స్కూల్ హెచ్ఎం డబ్బులు ఇస్తేనే టీసీ ఇస్తానంటూ ఓ పేరెంట్ తో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్కార్ స్కూళ్లలో టీసీ ఫ్రీగా ఇవ్వాల్సి ఉండగా హెచ్ఎంలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్స్ లో రూ. 200 నుంచి రూ.500, హైస్కూల్ లో రూ.500 నుంచి రూ.1000 తీసుకుంటున్నారు. హైయ్యర్ స్టడీస్ కోసం టీసీ కంపల్సరీ కావడంతో పేరెంట్స్ కూడా మరో దారి లేక టీచర్లు అడిగినంత వారి చేతుల్లో పెడుతున్నారు. 

వివాదాలకు కేంద్రంగా జగిత్యాల ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్

జగిత్యాల జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్​వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపు రెన్యూవల్ పేరుతో డిపార్ట్‌‌మెంట్​లోని ఓ ఆఫీసర్ స్కూళ్ల స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణ పేరుతో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌‌మెంట్స్ నుంచి ఒక్కో స్టూడెంట్‌‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎస్సెస్సీ ఎగ్జామ్స్ ఘటనలో ఇన్విజిలేటర్ ను కాపాడేందుకు పెద్దమొత్తంలోనే వసూలు చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ షోకాజ్ నోటీసులు, మెమోలతో సరిపెడుతున్నారన్న విమర్శలు 
వినిపిస్తున్నాయి.

ప్రైవేట్ స్టూడెంట్స్ కు సర్కార్ అడ్మిషన్ 

నవోదయ సీట్ల కేటాయింపులో గ్రామీణ ప్రాంతాల్లో చదివిన స్టూడెంట్స్ కు వెయిటేజీ ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు హెడ్ మాస్టర్లు పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ కు సర్కార్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇస్తున్నారు. వీరు రికార్డుపరంగా  మాత్రమే సర్కార్ స్కూల్ లో కొనసాగుతూ చదువులు మాత్రం ప్రైవేట్ లో చదువుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చదివిన స్టూడెంట్లు నవోదయ, సైనిక్ స్కూళ్లలో సీట్లు కోల్పోతున్నారు.