గురువులు దేవునితో సమానం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గురువులు దేవునితో సమానం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: ఉపాధ్యాయులు సమాజానికి ఆణిముత్యాల్లాంటి పౌరులను అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండలోని గండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని వ్యక్తంచేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తుందని, కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితులను మార్చాలని పేర్కొన్నారు.


 పదో తరగతి పరీక్షల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యావ్యవస్థ అభివృద్ధికి తనవంతు కృషిలో భాగంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీతో పాటు, ఇటీవల బొట్టుగూడ పాఠశాలకు కొత్త భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కలిగించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను మారాల్సిన అవసరం ఉందని కవి, రచయిత, రాజ్యసభ సభ్యుడు కోడూరి విశ్వవిజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. 

 ఢిల్లీలో పబ్లిక్  స్కూళ్లలో సీట్లు దొరకటం లేదని, అలాంటి పరిస్థితిని ప్రభుత్వ బడుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో నల్గొండ, భువనగిరి ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామెల్, బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, టి. పూర్ణచంద్ర, అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో రవి, అధికారులు పాల్గొన్నారు.