టీచర్ల మౌన దీక్ష ఉద్రిక్తం .. 13 జిల్లాల్లో స్పౌజ్‌‌‌‌ బదిలీలు చేపట్టాలని డిమాండ్‌‌‌‌

 
  • పిల్లలతో కలిసి స్కూల్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ ముందు నిరసన 
  • టీచర్లను అరెస్టు చేసి స్టేషన్‌‌‌‌కు తరలించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని స్పౌజ్ టీచర్లు చేపట్టిన మౌన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం గాంధీ జయంతి రోజున స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు పిల్లలతో కలిసి స్పౌజ్‌‌‌‌ టీచర్లు నిరసనకు దిగారు. డైరెక్టరేట్ ముందు మహాత్మా గాంధీ, సీఎం కేసీఆర్ ఫొటోలు పట్టుకొని బైఠాయించారు. 22 నెలలుగా భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న టీచర్లను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్‌‌‌‌ చేసిన వారిని చిక్కడపల్లి, గాంధీ నగర్‌‌‌‌‌‌‌‌, ముషీరాబాద్‌‌‌‌, నాంపల్లి పోలీస్‌‌‌‌ స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడంపై మండిపడ్డారు. పోలీస్ 
స్టేషన్లలో కూడా టీచర్లు దీక్ష కొనసాగించారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి..

స్పౌజ్ ఫోరం రాష్ట్ర నాయకులు వివేక్, నరేశ్‌‌‌‌ మాట్లాడుతూ.. 19 జిల్లాల్లో స్పౌజ్‌‌‌‌ బదిలీలు చేపట్టినట్లే, మిలిగిన 13 జిల్లాల్లో కూడాబదిలీలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ విషయమై ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. దీంతో గాంధీ జయంతి రోజున శాంతియుత మార్గంలో మౌన దీక్ష చేపట్టామన్నారు. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌లోపు ట్రాన్స్‌‌‌‌ఫర్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేయలేక, కుటుంబాలకు దూరంగా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉద్యోగం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. జనవరిలో 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు చేశారని, ఇంకా 1,500 మంది ఎస్జీటీ, లాంగ్వేజీ పండిట్, పీఈటీలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. ఖాళీలు లేని వారికి ప్రస్తుతానికి డిప్యుటేషన్ ఇచ్చి భవిష్యత్‌‌‌‌లో ఏర్పడే ఖాళీలతో అడ్జస్ట్ చేయాలని కోరారు. 

అరెస్టులను ఖండించిన ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి.. 

స్పౌజ్ బదిలీలు చేపట్టాలని మౌన దీక్ష చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఖండించారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారని, వారిని ఒకే జిల్లాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో 317 ద్వారా నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని కోరారు.