హనుమకొండ: స్థానికత ఆధారంగా టీచర్ల కేటాయింపు జరపాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ డీఈఓ ఆఫీసు ఎదుట టీచర్లు ధర్నా నిర్వహించారు. స్థానికత ఆధారంగా కాకుండా కేవలం సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు జరపాలని ప్రభుత్వం జీవో 317 జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో వల్ల ఉపాధ్యాయులు వారి ఉద్యోగ స్థానికతను, పిల్లల స్థానికతను కోల్పోయి.. వేరే జిల్లాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో పేర్కొన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 95 శాతం లోకల్, 5 శాతం నాన్ లోకల్ బదలాయింపు ఉండాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం జి వో 317 రద్దు చేయకుండా మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్థానికత కోసం పోరాడితే.. రాష్ట్రం వచ్చిన తర్వాత 317 ద్వారా భార్యా భర్తలు ఉద్యోగస్తులైతే.. వేర్వేరు జిల్లాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల జీవితాలను రోడ్డునపడేశారని వారు ఆరోపించారు. మా రాజ్యం మాకు కావాలి.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే.. చావా..? బతుకా..? అనే పరిస్థితి తీసుకొచ్చారని, సమాజ నిర్మాతలైన ఉపాధ్యాయులను రోడ్డునపడేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు జరపాలని వారు డిమాండ్ చేశారు.