ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై స్పష్టత ఇవ్వాలి :  సోమయ్య

ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై స్పష్టత ఇవ్వాలి :  సోమయ్య

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై స్పష్టత ఇవ్వాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, కార్యదర్శి ఎస్.భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సూర్యాపేటలో డీటీఎఫ్ జిల్లా నాలుగో వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 ఎండ్లకు పెంచడం ద్వారానే అనేకమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు నిలిచిపోయాయని, వయస్సు రీత్యా ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన వివిధ చెల్లింపుల భారం తగ్గించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. వెంటనే ఇప్పటికే రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వాలని డిమాండ్​చేశారు. పెండింగ్ బిల్లులు, డీఏలు అన్ని మంజూరు చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వేణు, ఆనంద్ భాస్కర్, రమణ, సిద్ధిక్ పాషా, జి.వెంకటేశ్వర్లు, ప్రభాకర్, క్రాంతికుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.