గోవులాంటి గురువులను గోస పెట్టిన గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317 ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు అధికారుల అనాలోచితమైన, తొందరపాటు చర్యవల్ల వారికి వంతపాడే కొన్ని ఉపాధ్యాయ సంఘాల వల్ల ప్రస్తుతం ఉపాధ్యాయులు చాలా తీవ్రమైన మనోవేదనకు గురి అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులను శాశ్వత ప్రాతిపదికపై కేటాయించుటకు తీసుకువచ్చిన జీవో 317 చాలా లోపభూయిష్ఠంగా ఉంది.
గతంలో స్థానికులకు అన్యాయం జరుగుతుందని జీవో 610తో వారు చదువుకున్న జిల్లా స్థానికతను చూసి ఆయా జిల్లాలకు పంపించడం జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పాటులో జీవో 317తో స్థానికతను విస్మరించి క్యాడర్ సీనియార్టీ ప్రాతిపదికగా తీసుకోవడం వలన ఒకే జిల్లాలోని ఉపాధ్యాయులు కొందరు కొత్తగా ఏర్పడిన జిల్లా స్థానికత చూడకుండా కేటాయించడం వలన, వారు తమ ప్రాంతం నుంచి ఇతర కొత్తగా ఏర్పడిన జిల్లాకు శాశ్వత ప్రాతిపదికన కేటాయించడం జరిగినది. దీంతో వారు ఉన్న ప్రాంతం నుంచి విడిచి చాలాదూరంలో పనిచేయాల్సి వస్తోంది.
జీవో 317 వల్ల భవిష్యత్తులో సమస్యలు
జీవో 317 ప్రకారం బదిలీకంటే ముందు 90శాతం ఉపాధ్యాయులు ఏప్రాంతంవారు ఆ ప్రాంతంలోనే పనిచేశారు. ఒక 10శాతం మంది మాత్రమే ఇతర ప్రాంతాలలో (కొత్త జిల్లాలో) వారి ఇష్టప్రకారం పనిచేసేవారు. 10శాతం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే సరిపోయేది. మొత్తం ఉపాధ్యాయులను సీనియార్టీ ప్రకారం బదిలీ చేయడం వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీనియారిటీ వలన భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించడం జరిగింది. స్పౌస్ ఒకే ప్రాంతంలో లేదా కనీసం ఒకే జిల్లాలో పనిచేయునట్లు నిర్ణయం తీసుకోలేదు.
గతంలో 1987లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఒకే జిల్లాలోని ఉపాధ్యాయులను ఆ జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్ నుంచి వేరొక రెవెన్యూ డివిజన్‌కు మార్పు చేయడం జరిగింది. అప్పుడున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి డివిజన్ మార్పు చేసి తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని విన్నపం చేసిన వెంటనే ఆ జీవో రద్దు చేసి తిరిగి ఎక్కడవారిని అక్కడికి పంపించడం జరిగింది. జీవో 317 వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కానీ, కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కలవడానికి కూడా అంగీకరించలేదు. వారికి అనుకూలమైన సంఘాల నాయకులను మాత్రమే కలిసేందుకు అంగీకరించేవారు.
జీవో 317ను ప్రభుత్వం రద్దు చేయాలి
కొంతమంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వారి వ్యక్తిగత స్వార్థంతో ప్రభుత్వం ఏది చేసినా ఒప్పుకునేవారు తప్ప ఉపాధ్యాయుల తరఫున మాట్లాడేవారు కాదు. ఒకప్పుడు ఎన్జీవో సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వాని కంటే ముందు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అప్పటి ముఖ్యమంత్రులు వారు చెప్పిన మాటలు విని సానుకూలంగా స్పందించేవారు. జీవో 317తో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఉపాధ్యాయులకు భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు అయినవారికి చాలా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు.
జీవో 317 బాధితుల సంఘం తరఫున ఎన్ని ధర్నాలు చేసినా, రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపాధ్యాయుల బాధలను చూడలేక ప్రస్తుత ప్రభుత్వం జీవో 317పై ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయడం చాలా హర్షించదగ్గ విషయం. గతంలో ప్రభుత్వం ఏ జిల్లా సీనియార్టీ ప్రకారం ఆ జిల్లాలోనే ప్రమోషన్స్ఇచ్చేది. ఇప్పుడు మల్టీజోన్ సీనియార్టీ చూడటం వలన ఒక్కొక్క పీజీహెచ్ఎం సుమారు 300 కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తోంది. పరస్పర బదిలీకి అవకాశం కల్పించడం వలన సీనియార్టీకి కూడా ప్రాధాన్యత లేక ఉపాధ్యాయులు మధ్య అనైతికమైన ఆర్థిక లావాదేవీలు జరిగినవి. ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తిరిగి పాఠశాలలు తెరిచేలోపే జీవో 317 రద్దు చేసి, మనోవేదనకు గురవుతున్న ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు సంతోషం కలిగిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేవంత్ సర్కారు తీసుకునే నిర్ణయం కోసం ఉపాధ్యాయ లోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.
- అల్లం మల్లికార్జున్‌రావు, ప్రధానోపాధ్యాయుడు (రిటైర్డ్)