
- అంకెకు బదులు టిక్‌లు, సర్కిళ్లు, పేర్లు రాసిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు
- పోలైన ఓట్లలో 10 శాతానికిపైగా చెల్లలే
- గ్రాడ్యుయేట్ల ఓట్లలో భారీగా ఇన్ వ్యాలిడ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు నిర్వహించిన పోలింగ్ లో కొందరు గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఓటేయడం రాలేదు. ఫలితంగా గ్రాడ్యుయేట్స్థానంలో సుమారు 28 వేల ఓట్లు, టీచర్స్థానంలో 871 ఓట్లు చెల్లకుండాపోయాయి. తాము ఓటేయదల్చుకున్న అభ్యర్థుల ఎదురుగా బాక్స్ లో 1,2, 3, 4, 5 లాంటి అంకెలకు బదులు టిక్ లు పెట్టడం, సర్కిల్స్ గీయడం, పేర్లు రాయడం, సిగ్నేచర్ చేయడం, కామెంట్స్ రాయడంలాంటి చర్యలతో ఆ ఓట్లన్నీ ఇన్ వ్యాలిడ్ అయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య 11 శాతానికి పైగానే ఉంది.
అవగాహన లోపంతోనే..
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉన్నత విద్యావంతులే. టీచర్లయితే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ డ్యూటీకి రెగ్యులర్ గా వెళ్తుంటారు. అయినా, తాము ఓటేసే విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్-, మెదక్,- ఆదిలాబాద్,- నిజామాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3.55 లక్షల ఓట్లలో సుమారు 2,52,100 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లకుండాపోయాయి.
సోమవారం నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లోనూ చెల్లని ఓట్లు వెలుగు చూశాయి. మొత్తం 27,088 మంది ఓట్లకుగాను 25,041 ఓట్లు పోలవగా.. అందులో 871 ఓట్లు ఇన్ వ్యాలిడ్ అయ్యాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలోనూ 499 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే అధికంగా ఉండడం గమనార్హం. చాలా మంది ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేయాలనే ఉద్దేశంతో ఆ అభ్యర్థి ఒక్కరి ఎదుటే టిక్ పెట్టడం, రౌండ్ మార్క్ చేయడంతో ఓట్లు చెల్లకుండాపోయాయి. ఇలాంటి ఓట్లను చూసిన అభ్యర్థులు అవన్ని తమకు పడే ఓట్లేనని.. కానీ, చెల్లకుండాపోయాయని ఆవేదన చెందడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
ముందస్తు ప్రచారం లేకనే..
చాలా మంది గ్రాడ్యుయేట్లకు పోలింగ్ రోజు పోలిం గ్ బూత్‌కు వచ్చే వరకు ఓటు వేసే విధానంపై అవగాహన ఉండడం లేదు. ఓటు వేసే విధానంపై మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ సందర్భంగా పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు.
అప్పుడు 9,932 .. ఇప్పుడు 28 వేల ఓట్లు ఇన్ వ్యాలిడ్
2019లో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో 9,932 ఓట్లు చెల్లకుండా పోయాయి. అప్పడు పోలైన ఓట్లలో 9.5 శాతం ఓట్లు చెల్లలేదు. ఈ సారి అంతకంటే ఎక్కువగా 28 వేల ఓట్లు (11 శాతం) ఇన్ వ్యాలిడ్ అయ్యాయి. 2019లో జరిగిన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 533 మంది టీచర్ల ఓట్లు చెల్లలేదు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగి 871 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి.