- సబ్జెక్టు టీచర్లతో సర్కారు హైస్కూళ్లు కళకళ
- 20 ఏండ్ల తర్వాత పండిట్,పీఈటీలకు ప్రమోషన్లు
- తొలిసారిగా ఆన్లైన్లో ప్రక్రియ
- ఎలాంటి ఇబ్బందులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆఫీసర్లు
- ఆనందంలో టీచర్లు, పండిట్, పీఈటీలు
అర్హులైన టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు గత సర్కారు హయాంలోనే చర్యలు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే మల్టీజోన్1, మల్టీజోన్2 పరిధిలో హెడ్మాస్టర్లకు బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో భర్తీకి చర్యలు ప్రారంభించింది. మల్టీజోన్1లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీ, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తైంది.
మల్టీజోన్ 1లో గవర్నమెంట్ హైస్కూళ్లలో 97 మంది, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 995 మందికి, మల్టీజోన్ 2లో గవర్నమెంట్ హైస్కూళ్లలో 141 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా పోస్టింగులు ఇచ్చారు. ఈ క్రమంలోనే టీచర్ల ప్రమోషన్లకు టెట్ కావాలనే ఎన్సీటీఈ నిబంధన అమలు చేయాలని కొందరు కోర్టుకు పోయారు. దీంతో మల్టీజోన్2లో జిల్లా పరిషత్ హైస్కూళ్లకు చెందిన స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఇదే సమయంలో టెట్ అర్హత లేకున్నా.. టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వొచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు కూడా పండిట్, పీఈటీల ప్రమోషన్ల విషయంలో సర్కారు నిర్ణయాన్ని సమర్థించి, ఎస్జీటీలు వేసిన కేసును కొట్టివేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగిపోయిన ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పలు కోర్టు కేసులు వచ్చినా.. వాటన్నింటినీ దాటుకుంటూ ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఎస్జీటీల బదిలీలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇరవై ఏండ్లకు నెరవేరిన పండితుల కల..
సుమారు ఇవరై ఏండ్ల తర్వాత లాంగ్వేజీ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)లకు ప్రమోషన్లు లభించాయి. ఇంతకాలం వారి పదోన్నతులకు ఆటంకంగా ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టులోని కేసులు పరిష్కారమయ్యాయి. దీంతో మొత్తం 8,630 మంది ఎస్జీటీ కేడర్లో ఉన్న లాంగ్వేజీ పండిట్లు, 1,849 మంది పీఈటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.
ప్రభుత్వం ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను సీరియస్గా తీసుకోవడంతో అడ్డంకులను అధిగమించి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తోంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పాత్ర కీలకంగా ఉంది. తొలిసారిగా ఈ ప్రక్రియను ఆన్లైన్లో విజయవంతంగా పూర్తి చేయడంపై టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు చెప్పారు.