- గణిత ప్రయోగాలతో బోధిస్తున్న ఉపాధ్యాయుడు సాయిలు
- గణిత రత్న పురస్కారంతో తెలంగాణ గణితఫోరం సత్కారం
- ప్రశంసిస్తున్న సహచర ఉపాధ్యాయులు
ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన గణిత ల్యాబ్ జిల్లాలోని మొట్టమొదటి గణిత ల్యాబ్ గా పేరుగాంచింది. జిల్లాలోని ఏ మండలంలో ఇటువంటి ల్యాబ్లేదు.ఈ ల్యాబ్ లో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గణిత ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లాలోని కాంప్లెక్స్ ఉపాధ్యాయులు గణిత ల్యాబ్ ను ప్రత్యేకంగా సందర్శించడం తో ఈ ల్యాబ్ జిల్లాలో ప్రాచుర్యం పొందింది. దీని ఏర్పాటు వెనక హైస్కూల్గణిత ఉపాధ్యాయుడి కృషి ఎంతో ఉంది.
ఎడపల్లి, వెలుగు: విద్యార్థులు గణితంలో రాణించాలని గణిత ఉపాధ్యాయులు సొంత ఖర్చుతో గణిత ల్యాబ్ ఏర్పాటు చేశారు. గణిత విద్యా బోధనలో ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులను గణితంలో రాణించేందుకు గణిత ల్యాబ్‌ను ఏర్పాటు చేసి జిల్లాకే తలమానికముగా నిలిచేలా చేశారు. ఈయన 25 సంవత్సరాలుగా గణితంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
రూ.7 వేల సొంత ఖర్చుతో విద్యార్థులకు ఐడీ కార్డ్స్ అందజేశారు. ఈయన సేవలను గుర్తించి తెలంగాణ గణితఫోరం కార్యవర్గం జిల్లాస్థాయి ఉత్తమ గణిత ఉపాధ్యాయ పురస్కారం గణిత రత్న 2024 అవార్డును అందజేసి సత్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఈ పాఠశాలను ఇటీవల సందర్శించి సాయిలు ఏర్పాటు చేసిన గణిత ల్యాబ్‌ను సందర్శించి అభినందించారు.
గణిత ప్రయోగశాల ప్రత్యేకతలు
గణిత ల్యాబ్ అనేది గణిత శాస్త్రాన్ని గమనించి, అన్వేషించి, అనుభవించేందుకు సృష్టించిన ఒక ప్రత్యేక స్థలం. ఇది విద్యార్థులకు గణితాన్ని సృజనాత్మకంగా, సరళంగా నేర్పడం కోసం ఉపయోగపడుతుంది. గణిత ల్యాబ్ ఉపయోగాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రాక్టికల్ అనుభవాల ద్వారా గణితంపై ప్రేమ, ఆసక్తి పెంపొందుతుంది. గణితాన్ని రిజిడ్ సబ్జెక్టుగా కాకుండా, సృజనాత్మకమైన దృక్పథంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది. వివిధ సమస్యలను ప్రాక్టికల్ గా పరిష్కరించడం ద్వారా, లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ మెరుగవుతాయి. గణిత సూత్రాలు, ధోరణులు, ప్రమాణాలను ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, మోడల్స్, క్రియాశీల కార్యక్రమాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనకు
విద్యార్థులు తాము ఆలోచించి, ప్రయోగాలు చేసి, కొత్త విషయాలను కనుగొనే అవకాశం పొందుతారు. సృజనాత్మక ఆలోచనకు గణిత ల్యాబ్ పెద్ద పాత్ర పోషిస్తుంది. క్లిష్టమైన సూత్రాలు, థియరమ్స్, కాన్సెప్ట్‌లను యాక్టివిటీల ద్వారా సులభతరం చేస్తుంది.3డి మోడల్స్, గ్రాఫ్స్, గణితీయ ఉపకరణాల వాడకంతో మరింత స్పష్టత వస్తుంది. గణిత ల్యాబ్‌లో గ్రూపు యాక్టివిటీల ద్వారా, విద్యార్థులు సహచరులతో కలిసి పని చేయడం, వారి ఆలోచనలను పంచుకోవడం నేర్చుకుంటారు. గణితాన్ని సాధారణంగా భయంకరమైన సబ్జెక్టుగా భావించే విద్యార్థుల మదిలో ఈ ల్యాబ్ ఆ భయాన్ని పోగొడుతుంది.
విద్యార్థులు తమ ఐడియాలను గణిత పద్ధతుల ద్వారా పరీక్షించేందుకు, నూతన సూత్రాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ వున్న త్రిభుజాలు, వృత్తాలు, మోడల్స్, గణిత మిషన్లు మొదలైన ఉపకరణాల సహాయంతో ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా గణిత ల్యాబ్ విద్యార్థులకు గణితంపై ఆచరణాత్మక అవగాహన కలిగించి, దాన్ని ఆసక్తికరంగా నేర్పడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ల్యాబ్ వ్యవస్తాపకుడు సాయిలు వివరించారు.