ఉద్యోగుల విభజనలో నష్టపోయేది టీచర్లు, నిరుద్యోగులే

విశ్లేషణ : తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలను కలుపుతూ1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇక్కడి ప్రజలు ఏపీతో చేరేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు నుంచి 1969 వరకు ఉద్యమించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్ర డిమాండ్​ను తిరస్కరిస్తూ వచ్చింది. తాత్కాలిక స్వల్ప ప్రయోజనాలు కల్పించేలా ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల పురోగమనం పేరిట 1975లో 371–డి అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా విద్య, ఉద్యోగాల్లో తెలంగాణ ప్రజలకు స్థానికత అనే అంశం కింద జోనల్​విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత జోనల్​విధానం అవసరం లేనప్పటికీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న10 జిల్లాలు మొదట31 జిల్లాలుగా తర్వాత మరో 2 జిల్లాలతో 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి. వీటి ప్రకారం ప్రభుత్వం కొత్త జోనల్​విధానం తీసుకొచ్చింది. 31 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా ఏర్పాటు చేస్తూ 30 ఆగస్టు 2018లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి మరో రెండు జిల్లాల పెంపుతో 33 జిల్లాలకు 30 జూన్​ 2021లో సవరణ ఉత్తర్వు వెలువడింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 27న 255,256,257,258 ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జోనల్ ​విధానంలో ఉద్యోగుల విభజన చేపట్టేందుకు డిసెంబర్​6న ప్రభుత్వం 317 జీవో ఇచ్చింది. ఈ నెలాఖరులోగా విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వులో ఉద్యోగుల విభజన ఉద్యోగి స్థానికత ఆధారంగా కాకుండా.. ఆ ఉద్యోగి ప్రస్తుతం పని చేస్తున్న పోస్టులోని సర్వీస్ ​ఆధారంగా పూర్వపు జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు వారి నుంచి ఆప్షన్స్ ​తీసుకొని అలాట్​మెంట్​ చేయాలని​నిర్ణయించారు.

టీచర్లకు తీవ్ర నష్టం
జిల్లా కమిటీలు జిల్లా స్థాయి పోస్టును వర్గీకరిస్తున్న సందర్భంలో విద్యాశాఖలోని 1.36 లక్షల పోస్టుల్లో పనిచేస్తున్న1.09 లక్షల మంది టీచర్లలో 1.04 లక్షల మంది పోస్టులను జిల్లా క్యాడర్​లో ఉంచారు. దీంతో 90 శాతం మంది టీచర్ల పోస్టులు రీఅలాట్​మెంట్​అవ్వాల్సి వస్తోంది. అన్ని శాఖల్లో ఆఫీస్​సబార్డినేట్, జూనియర్​అసిస్టెంట్​స్థాయి పోస్టులను జిల్లా క్యాడర్​లో ఉంచిన కమిటీలు.. సూపరింటెండెంట్, హెడ్​కానిస్టేబుల్, ఏఎన్ఎం లాంటి నాన్​ గెజిటెడ్​పోస్టులను కూడా జోనల్​క్యాడర్​లో ఉంచారు. అయితే విద్యా శాఖ విషయంలో మాత్రం ఎస్జీటీ, స్కూల్​అసిస్టెంట్​పోస్టులను జిల్లా స్థాయిలో ఉంచడం టీచర్లకు శాపంగా మారింది. దీనివల్ల ఏ శాఖలో లేని విధంగా పెద్ద సంఖ్యలో టీచర్లు విభజనకు గురికావాల్సి వస్తోంది. 

నిరుద్యోగులకు పెద్ద దెబ్బ
ఉద్యోగుల విభజన నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన లక్షలాది డీఎడ్, బీఎడ్ ​పూర్తి చేసిన నిరుద్యోగులకు పెద్ద దెబ్బ. ఎక్కువ సర్వీస్​ఉన్న టీచర్లు పట్టణ ప్రాంతాలు గల జిల్లాలకు, తక్కువ సర్వీస్​ఉన్న టీచర్లు వెనకబడిన, గ్రామీణ జిల్లాలకు అలాట్​అవుతారు. దీనివల్ల సీనియర్లు ఉన్న జిల్లాల్లో 3 సంవత్సరాల్లో ఖాళీలు ఏర్పడితే, జూనియర్లు వెళ్లిన జిల్లాల్లో 30 సంవత్సరాల దాకా ఖాళీలు ఏర్పడే అవకాశమే ఉండదు. దీని వల్ల వెనకబడ్డ జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ.. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చేస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగుల విభజన తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. 

టీచర్లతో సంప్రదించకుండా..
ప్రభుత్వం ఉద్యోగుల విభజన కోసం రిలీజ్​చేసిన జీవో 317 వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఉపాధ్యాయులే. గతంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి రిలీజ్​చేసేవారు. కానీ ప్రభుత్వం టీచర్ల సంఘాలను సంప్రదించకుండానే జీవో 317 ఇచ్చింది. లక్షమంది ఉద్యోగులను ప్రభావితం చేసే జీవో ఇచ్చే ముందు ప్రభుత్వం కనీసం టీచర్ల సంఘాలతో కొన్ని సూచనలు తీసుకోవాల్సి ఉండే. అలా జరగలేదు కాబట్టే ఇప్పుడు విభజన ఇటు టీచర్లను, అటు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టేదిగా మారింది. ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని నివారించడంలో టీచర్ల సంఘాలు, ఎమ్మెల్సీలు విఫలమయ్యారు. సమస్య ఉత్పన్నమైన తర్వాత కొన్ని సంఘాలు ఎస్జీటీ, ఎస్ఏలను జోనల్​క్యాడర్​లో ఉంచాలని అంటున్నాయి. ఇప్పటికైనా విభజన ప్రక్రియను ఆపి, ఉత్తర్వుల్లో మార్పు చేస్తే తప్ప టీచర్లకు, నిరుద్యోగులకు న్యాయం జరగదు. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 370 జీవో తెచ్చి టీచర్లను డివిజన్​ నుంచి మరో డివిజన్​కు బదిలీలు చేస్తే ఉద్యమించినట్లే.. ఇప్పుడు జీవో 317 విషయంలోనూ పోరాడాలి. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ భేషజాలకు పోకుండా జాయింట్ ​కమిటీ ఆఫ్​ టీచర్స్​ యూనియన్స్(జేసీటీయూ)గా ఏర్పడి ఎస్ఏ, ఎస్జీటీలను జోనల్​పోస్టులుగా మార్పు చేయించుకొని విభజన  ప్రక్రియ చేపట్టే విధంగా ఉద్యమించాలి. లేదంటే టీచర్ల సమస్యలను పట్టించుకోని సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చరిత్రహీనులుగా మిగులుతారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగుల విభజన వల్ల టీచర్లు, నిరుద్యోగ యువతకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఎస్జీటీ, స్కూల్​అసిస్టెంట్ల పోస్టులను జిల్లా స్థాయిలో ఉంచడం, స్థానికత గాకుండా, సర్వీస్​సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవడం వల్ల 90 శాతం మంది టీచర్లపై ప్రభావం పడుతోంది. ఎక్కువ సర్వీస్​ఉన్న టీచర్లు పట్టణ ప్రాంతాలు గల జిల్లాలకు, తక్కువ సర్వీస్​ఉన్న టీచర్లు వెనకబడిన, గ్రామీణ జిల్లాలకు అలాట్ అవుతున్నారు. దీనివల్ల సీనియర్లు ఉన్న జిల్లాల్లో మూడేండ్లలో ఖాళీలు ఏర్పడితే, జూనియర్లు ఉన్న జిల్లాల్లో 30 ఏండ్ల దాకా ఖాళీలు ఏర్పడే అవకాశమే ఉండదు. దీని వల్ల వెనకబడ్డ జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా విభజన ప్రక్రియపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

- పులి సరోత్తం రెడ్డి, 
బీజేపీ రిటైర్డ్​ టీచర్స్, ఎంప్లాయీస్​రాష్ట్ర కోచైర్మన్