క్లాసులు జరగట్లే.. ఫైళ్లు కదలట్లే

క్లాసులు జరగట్లే.. ఫైళ్లు కదలట్లే
  • రెండు వారాలుగా సమ్మెలోనే సమగ్ర శిక్ష ఉద్యోగులు
  • కేజీబీవీ, యూఆర్ఎస్​లలో బోధన బంద్ 
  • సిలబస్  పూర్తికాక స్టూడెంట్లలో టెన్షన్ 
  • మండల, జిల్లా కేంద్రాల్లో నిలిచిపోయిన పనులు, ఫైళ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కేజీబీవీ, యూఆర్ఎస్ (అర్బన్  రెసిడెన్షియల్  స్కూల్) స్కూళ్లలో  గత రెండు వారాలుగా బోధన బంద్  అయింది. తమ సమస్యలు  పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులంతా సమ్మెబాట పట్టిన నేపథ్యంలో కేజీబీవీలు, యూఆర్ఎస్, ఐఈఆర్పీ కేంద్రాల్లో క్లాసులు బంద్ అయ్యాయి. మండల జిల్లా ఆఫీసుల్లో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. దీని ప్రభావం విద్యార్థులతో పాటు అధికారులపైనా  పడుతోంది. మరోపక్క సమ్మె విరమింపజేసేందుకు సర్కారు ప్రయత్నం చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

దీంతో ఉద్యోగులు మరింత ఆగ్రహంతో సమ్మెలో పాల్గొంటున్నారు. తమను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్  చేయాలని, అప్పటి వరకూ పేస్కేల్  అమలు చేయాలని డిమాండ్  చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్  హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10 నుంచి 19 వేలకు పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల, క్లస్టర్ , స్కూల్  స్థాయిలో సీఆర్​పీలు, ఎంఐఎస్ ​ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసేంజర్లు, ఏపీఓలు, సిస్టమ్  అనలిటిక్స్ లు, టెక్నికల్  పర్సన్స్, పార్ట్ టైమ్  ఇన్ స్ర్టక్టర్లు సమ్మెలో ఉన్నారు. 

వీరితో పాటు కేజీబీవీ,  యూఆర్ఎస్​లలో పనిచేసే ఎస్ఓలు, సీఆర్టీలు, పీజీసీఆర్టీలు, ఐఆర్ సీ కేంద్రాల్లో పనిచేసే ఐఈఆర్పీలు విధులు బహిష్కరించారు. దాదాపు పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో విద్యాసంస్థల్లో క్లాసులు బంద్  కాగా.. ఆఫీసుల్లో ఫైల్స్  ఆగిపోయాయి. స్కూల్  ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నించినా  ఫలించలేదు. స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, ప్లానింగ్  బోర్డు వైస్ చైర్మన్  చిన్నారెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు చర్చలు జరిపినా.. సరైన హామీ రాలేదని వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. 

దీంతో ఎంఈఓ, డీఈఓ ఆఫీసుల్లో నిత్యం ఉన్నతాధికారులకు అందించాల్సిన ఫైల్స్ అన్నీ ఆగిపోయాయి. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకం బిల్లులు,  యూడైస్ ప్లస్ డేటా అప్​ లోడ్, ఆపార్  ఐడీ క్రియేషన్  ప్రక్రియ, స్టూడెంట్ల నమోదు, టీచర్ల ఆన్ లైన్ డేటా అప్​లోడ్  అప్​గ్రేడెషన్  వంటి అనేక పనులు నిలిచిపోయాయి. చాలా మండలాల్లో ఎంఈఓ ఆఫీసులకు తాళాలు పడ్డాయి.

క్లాసులు లేక స్టూడెంట్ల ఆందోళన

టీచర్ల సమ్మెతో కేజీబీవీలు, యూఆర్ఎస్, భవిత కేంద్రాల్లో క్లాసులు బంద్  అయ్యాయి. వాటిలో చదివే సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కేజీబీవీలో టెన్త్, ఇంటర్  స్టూడెంట్లకు కొంత ఇబ్బంది మొదలైంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్  ఎగ్జామ్స్  షెడ్యూల్  రిలీజ్ అయింది. ఇంకా సిలబస్  పూర్తికావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో టీచర్లు అందుబాటులో లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన గురవుతున్నారు. మరోపక్క ప్రత్యామ్నాయంగా కేజీబీవీల్లో ఎంఈఓలు,  గవర్నమెంట్  స్కూల్  టీచర్లతో పాఠాలు చెప్పించే ప్రయత్నం చేసినా ఫలితం చూపించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందని పేరెంట్స్  కోరుతున్నారు.

సీఎం హామీ అమలు చేయాలి

వరంగల్  ఏకశిల పార్కు వద్ద నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రత్యేక గైడ్​ లైన్స్ ఇవ్వాలి. అప్పటి వరకూ హెచ్ఆర్​ పాలసీతో కూడిన పేస్కేలు అమలు  చేయాలి. రిటైర్మెంట్  బెనిఫిట్స్, హెల్త్  కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ పరీక్షల్లో వెయిటేజీ ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం.
- ఎం.సురేందర్,  సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేత