
నిర్మల్, వెలుగు: వర్షాల కారణంగా పచ్చదనంతో కళకళలాడాల్సిన నిర్మల్ జిల్లాలోని అడవులు తెగులుతో అందవిహీనంగా మారుతున్నాయి. టేకు చెట్లు తెగులుకు గురవడంతో ఆ చెట్లన్నీ ఎర్రబారి కళతప్పిపోతున్నాయి. దీంతో చెట్లు బలహీనంగా మారిపోతున్నాయి. అయితే, ఈ తెగులు పట్ల అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదు. యుటెక్టోనా మాచేర్యాలీస్ అనే తెగులు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
టేకు చెట్టును, ఆకుల్లోని రసాన్ని ఓ రకమైన చీడపురుగులు పీల్చడం కారణంగానే ఇలా రంగు మారి బలహీనమవుతాయని పేర్కొంటున్నారు. ఈ చీడపురుగులు కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగిస్తూ ఆకులపై దాడి చేయ డంతో ఆకులన్నీ రాలిపోతాయంటున్నారు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని చెబుతున్నారు.