(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ప్రపంచ క్రికెట్‌ను శాసించే అతి సంపన్న బోర్డు మనది.. అత్యుత్తమ సౌకర్యాలు, అసాధారణ ఆటగాళ్ళు మన సొంతం. పేరుకు తగ్గట్టుగానే ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నాం. స్వదేశంలో తిరుగులేని ఆట చూపెడుతూ.. విదేశాల్లోనూ సిరీస్‌లు గెలుస్తున్నాం. సవాల్ విసిరే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలోనూ సత్తా చాటుతూ మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంతో దూసుకెళ్తున్నాం. కానీ, ఇవేవీ సంతృప్తిని ఇవ్వడం లేదు. ఏదో వెలితి జట్టును వెంటాడుతూనే ఉంది. టీమిండియా ఖాతాలో పుష్కరకాలంగా ఒక లోటు కనిపిస్తూనే ఉంది.ఆ లోటు పేరే వరల్డ్ కప్.
ధోనీ నాయకత్వంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ఎందరు ప్రయత్నించినా.. ఎంతగా పోరాడినా నెరవేరని కల పుష్కర కాలం తర్వాత సాకారమైంది. గతేడాది వన్డే కప్పు చిక్కినట్టే చిక్కి చేజారినా.. కరీబియన్ల గడ్డపై రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా కసిగా.. కలిసి కట్టుగా కదం తొక్కుతూ టీ20 కప్పును సొంతం చేసుకుంది. అంతే శతకోటి భారతావని ఆనందంలో మునిగిపోయింది. దేశ విదేశాల్లో లెక్కకు మించిన విజయాలు, రికార్డులు, రివార్డులు ఇవ్వని సంతృప్తిని ఈ ఒక్క కప్పు ఇచ్చేసింది.
నాయకుడు నడిపించాడు
‘టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోకి నలుగురు స్పిన్నర్లను తీసుకోవడానికి కారణం నేనిప్పుడే చెప్పను. జట్టులో నలుగురు స్పిన్నర్లు కచ్చితంగా ఉండాలని నేను కోరాను’ వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ తర్వాత మీడియా సమావేశంలో రోహిత్ శర్మ చేసిన కామెంట్ ఇది. టోర్నీలో ఇండియా ముందుకెళ్తున్న కొద్దీ రోహిత్ నలుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నాడో అందరికీ అర్థమైంది. ఈ మెగా టోర్నీలో ఎలా ఆడాలి.. జట్టులో ఎవరు ఉండాలనే దానిపై స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లిన రోహిత్ కెప్టెన్‌గా సూపర్ హిట్ అయ్యాడు. బ్యాటర్‌గానూ హిట్టయిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాడు. కీలకమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌ల్లో 92, 57 స్కోర్లతో జట్టుకు మంచి స్కోరు అందించి విజయాలకు బాటలు వేశాడు. . ఇండియాకు ఐసీసీ ట్రోఫీలు అందించిన కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ సరసన నిలిచాడు.
నమ్మకం నిలబెట్టారు
ఈ టోర్నీలో వరుసగా నిరాశ పరుస్తున్నా కెప్టెన్, కోచ్ తమపై పెట్టుకున్న నమ్మకానికి విరాట్ కోహ్లీ, శివం దూబే ఆఖరాటలో నిలబెట్టారు. రోహిత్, పంత్, సూర్య ఫెయిలైన వేళ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ తొలుత అక్షర్ పటేల్ తర్వాత శివం దూబే స్వేచ్ఛగా ఆడేలా సపోర్ట్ ఇచ్చాడు. ఫైనల్‌కు ముందు ఏడు మ్యాచ్‌ల్లో 75 రన్స్ చేసిన విరాట్ ఆఖరి పోరులోనే 76 రన్స్ చేసిన కోహ్లీ ఔరా అనిపించాడు. ప్లేయర ఆఫ్ మ్యాచ్ అవార్డుతో ఈ ఫార్మాట్‌కు సగర్వంగా వీడ్కోలు పలికాడు.
బౌలర్లు గెలిపించారు
‘బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపిస్తారు.. బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారు’ అనేందుకు టీమిండియానే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ టోర్నీలో మన బౌలర్లు పెర్ఫామెన్స్ సూపర్బ్. పేస్ లీడర్ బుమ్రా బౌలింగ్ దాడిని ముందుండి నడిపించాడు. అవసరం అయిన ప్రతీసారి వికెట్ పడగొడుతూ జట్టును గెలిపించాడు. అర్ష్‌దీప్ సింగ్ 17 వికెట్లతో టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫైనల్లో ఫెయిలైనా అంతకుముందు మ్యాచ్‌ల్లో కుల్దీప్ యాదవ్ చేసిన మ్యాజిక్ తక్కువేం కాదు. ఇక, టోర్నీకి ముందు అనేక విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా తన ఆటతోనే వాటికి సమాధానం చెప్పాడు.
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా అవి తన ఆటపై ప్రభావం చూపకుండా చూసుకుంటూ పేస్ ఆల్‌రౌండర్‌గా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. బ్యాట్, బాల్‌తో విలువైన పెర్ఫామెన్స్ చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో భారీ షాట్లతో విజృంభిస్తున్న హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తప్పిన పాండ్యా.. చివరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు.
ద్రవిడ్‌కు గురు దక్షిణ
టీ20 వరల్డ్ కప్ విజయంతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సగర్వంగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఓ ఆటగాడిగా వరల్డ్ కప్‌ను అందుకోలేకపోయిన ద్రవిడ్ కోచ్‌గా తన కలను నెరవేర్చుకున్నాడు. వాస్తవానికి ఇదే వెస్టిండీస్ గడ్డపై 2007 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ మన జట్టు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడంతో తలదించుకోవాల్సి వచ్చింది. కానీ, అదే విండీస్ గడ్డపై వరల్డ్ కప్ విజయంలో భాగమై విజయ గర్వంతో తలెత్తుకున్నాడు. మూడేండ్లుగా వెన్నంటి ఉండి తమకు మార్గనిర్దేశం చేసిన ద్రవిడ్‌కు ఇండియా ఆటగాళ్లు గురు దక్షిణగా వరల్డ్ కప్ చేతిలో పెట్టారు.
అసలు హీరో అక్షర్
బ్యాటింగ్‌లో రోహిత్, బౌలింగ్‌లో బుమ్రా జట్టును ముందుండి నడిపించినా.. ఈ వరల్డ్ కప్ విక్టరీలో అసలు హీరో అక్షర్ పటేల్ అనొచ్చు. బౌలింగ్‌తో పాటు అనూహ్యంగా బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. బ్యాటింగ్ వస్తే.. మేటి బ్యాటర్‌లా.. బంతి అందుకుంటే మెయిన్ స్పిన్నర్‌లా జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. సెమీఫైనల్లో వరుసగా మూడు ఓవర్లలో తొలి బాల్‌కే వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఫైనల్లో అతని బ్యాటింగ్ అద్భుతం.
34 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. ఒత్తిడి పెరుగుతున్నప్పుడల్లా సిక్సర్లతో ఎదురుదాడికి దిగిన తీరుకు సలాం కొట్టాల్సిందే. ఛేజింగ్‌లో క్రీజులో కుదురుకున్న ప్రమాదక ట్రిస్టాన్ స్టబ్స్‌ను బౌల్డ్ చేసి సఫారీల స్పీడుకు బ్రేకులు వేసి తాను అసలైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు.