పంచ్ ఇచ్చేదెవరు?..నేటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు

పంచ్ ఇచ్చేదెవరు?..నేటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టు
  • సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆధిక్యంపై ఇరు జట్ల గురి..ఉదయం 5 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌, హాట్‌‌‌‌ స్టార్​లో లైవ్‌‌‌‌

మెల్‌‌‌‌బోర్న్‌ ‌‌‌: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అత్యంత కీలకమైన టెస్టు వార్‌‌‌‌‌‌‌‌కు సమయం ఆసన్నమైంది. ప్రఖ్యాత మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ క్రికెట్ క్లబ్ (ఎంసీజీ) గ్రౌండ్ వేదికగా ఇరు జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు గురువారం నుంచి జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో చెరోటి నెగ్గిన తర్వాత మూడోది డ్రాగా ముగియడంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లూ ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. నాలుగో టెస్టులో నెగ్గితే టీమిండియా బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీని  నిలబెట్టుకోనుంది.

ఒకవేళ ఆసీస్ గెలిస్తే దశాబ్దం తర్వాత ఇండియాపై సిరీస్‌‌‌‌ నెగ్గేందుకు ఓ అడుగు ముందుకేయనుంది. గత రెండు పర్యటనల్లో ఇండియా ఎంసీజీలో జయకేతనం ఎగురవేసి సిరీస్‌‌‌‌లు నెగ్గింది. అదే ఉత్సాహంతో ఎంసీజీలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు గత ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్‌‌‌‌ కసిగా ఉంది. ఒకవేళ ఈ పోరులో ఆసీస్‌‌‌‌ ఓడితే స్వదేశంలో మూడోసారి బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని చేజార్చుకుంటున్న అవమానాన్ని మూటగట్టుకుంది.

ఇండియా ఓడితే.. వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి వైదొలగనుంది. దాంతో పాటు ట్రోఫీని కోల్పోయే ప్రమాదంలో నిలుస్తుంది. ఏదేమైనా క్రిస్‌‌‌‌మస్‌‌‌‌ తర్వాతి రోజు (బాక్సింగ్‌‌ డే) నుంచి జరిగే ఈ మ్యాచ్‌‌‌‌ ఇరు జట్లకూ కీలకమైంది. మరి ఎంసీజీలో 90 వేల పైచిలుకు ఫ్యాన్స్ మధ్య జరిగే బాక్సింగ్‌‌‌‌ డే టెస్టులో పంచ్‌‌‌‌ ఇచ్చేదెవరో?  పంచ్ పడేది ఎవరిపైనో చూడాలి!

ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా రోహిత్!

కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి ఔరా అనిపించిన టీమిండియా ఆ తర్వాత అన్ని విభాగాల్లో తేలిపోతోంది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఇండియా బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. జట్టును ముందుండి నడిపించాల్సిన నాయకుడు రోహిత్‌‌‌‌ గత మూడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో నిరాశ పరిచాడు. కేఎల్‌‌‌‌ రాహుల్ కోసం ఈ సిరీస్‌‌‌‌లో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో ఆడిన కెప్టెన్‌ హిట్ అవ్వలేకపోయాడు. దాంతో ఈ పోరులో రోహిత్ తిరిగి ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా వచ్చే చాన్సుంది. అదే జరిగితే సిరీస్‌‌‌‌లో ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న రాహుల్ మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో, గిల్ మిడిలార్డర్‌‌లో  బ్యాటింగ్ చేయనున్నారు.

ఎవరు ఏ స్థానంలో వచ్చినా అందరూ బ్యాట్ ఝుళిపిస్తేనే జట్టు ముందుకెళ్తుంది. అందరికంటే ముందుగా కెప్టెన్ రోహిత్‌‌‌‌ తక్షణమే గాడిలో పడాలి. అదే సమయంలో తొలి టెస్టులో సెంచరీలతో ఆకట్టుకున్న తర్వాత గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో నిరాశపరిచిన యంగ్ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌, సీనియర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌  కోహ్లీ తిరిగి ఫామ్‌‌‌‌ అందుకోవాలి. జైస్వాల్‌‌‌‌ కొత్త బంతితో కాస్త ఓపిగ్గా ఆడితే మంచిది. వరుసగా ఆఫ్ స్టంప్‌‌‌‌ బాల్స్‌‌‌‌కు ఔటవుతున్న కోహ్లీ తనకు అచ్చొచ్చిన ఎంసీజీలో అయినా ఆ బలహీనతను వీడి ‘కింగ్‌‌‌‌ కోహ్లీ’ అనిపించుకోవాల్సిన సమయం వచ్చింది. రాహుల్ ఫామ్‌‌‌‌లో ఉండటం ప్లస్ పాయింట్‌‌‌‌. 

మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లోపంత్‌‌‌‌ బాధ్యతగా ఆడాలి.  గత మ్యాచ్‌‌‌‌లో మెరుగ్గా బ్యాటింగ్‌‌‌‌ చేసిన దృష్ట్యా జడేజా తుది జట్టులో కొనసాగే చాన్సుంది. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌లో ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  ఎక్స్‌‌‌‌ట్రా స్పిన్నర్‌‌‌‌గా సుందర్‌‌‌‌‌‌‌‌ను ఆడించే  ఆలోచన మేనేజ్‌‌‌‌మెంట్ చేయొచ్చు. కానీ, తన కోసం సిరీస్‌‌‌‌లో సత్తా చాటుతున్న నితీశ్‌‌‌‌ రెడ్డిపై వేటు వేస్తే ప్రతికూల సంకేతాలు వెళ్లొచ్చు.

ఇక, బౌలింగ్‌‌‌‌లో సిరీస్‌‌‌‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బుమ్రా బాక్సింగ్ డే టెస్టులోనూ ఇండియాకు కీలకం కానున్నాడు. అయితే, పేస్‌‌‌‌ వికెట్‌‌‌‌పై మరో ఎండ్‌‌‌‌లో అతనికి సిరాజ్‌‌‌‌, ఆకాశ్‌‌‌‌ దీప్ నుంచి సరైన సపోర్ట్ లభిస్తేనే వికెట్లు వస్తాయి. ముఖ్యంగా జోరు మీదున్న ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ను అడ్డుకునే మార్గాలను ఇండియా  బౌలర్లు అన్వేషించాలి. 

ఆత్మవిశ్వాసంలో ఆసీస్‌‌‌‌

తొలి టెస్టులో ఓడినా పింక్ బాల్‌‌‌‌ టెస్టులో గెలిచి బలంగా పుంజుకున్న ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌‌‌‌లోనూ ఇండియాను ఓడించినంత పని చేసింది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో పైచేయి తర్వాత ఆతిథ్య జట్టు మంచి ఆత్మవిశ్వాసంలో ఉంది. వరుసగా రెండు సెంచరీలతో ట్రావిస్‌‌‌‌ హెడ్ సూపర్ ఫామ్‌‌‌‌లో ఉండగా.. గత పోరులో స్టీవ్ స్మిత్ కూడా వందతో జోరందుకోవడంతో ఆ జట్టు బలం పెరిగింది. కెప్టెన్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ పేస్ బౌలింగ్ పవర్‌‌ఫుల్‌గా బలంగా ఉంది. కమిన్స్‌‌‌‌, స్టార్క్‌‌‌‌ ఇండియా బ్యాటర్లకు సవాల్ విసురుతుండగా..

గాయంతో సిరీస్‌‌‌‌కు దూరమైన హేజిల్‌‌‌‌వుడ్ స్థానంలో బరిలోకి దిగనున్న బోలాండ్‌‌‌‌తో కూడా మనోళ్లకు ముప్పు ఉంది. అయితే, ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ఖవాజ ఫెయిల్యూర్ ఆ టీమ్‌‌‌‌ను ఇబ్బంది పెడుతోంది. సిరీస్‌‌‌‌లో మూడు మ్యాచ్‌‌‌‌ల్లో ఆ టీమ్‌‌‌‌కు మంచి ఆరంభాలు లభించలేదు. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌స్వీనిని తప్పించి అరంగేట్రం ఆటగాడు సామ్ కొన్‌‌‌‌స్టస్‌‌‌‌ను జట్టులోకి తీసుకుంది. 19 ఏండ్ల ఈ కుర్రాడిపై ఆసీస్‌‌‌‌ చాలా నమ్మకం ఉంచింది. తుది జట్టును ముందుగానే ప్రకటించిన ఆసీస్ కొన్‌‌‌‌స్టస్‌‌‌‌, బోలాండ్‌‌‌‌ను తీసుకొని ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా లైయన్‌‌‌‌తో బరిలోకి దిగుతోంది. 

పిచ్‌‌‌‌/ వాతావరణం

ఎంసీజీ పిచ్ కొన్నాళ్ల నుంచి పేసర్లకు సర్గధామంగా మారింది. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం రెడీ చేసిన వికెట్‌‌‌‌పై 6 మి.మీ పచ్చిక ఉంది. అయితే తొలి రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుంది. వికెట్‌‌‌‌పై పచ్చిక ఎండిపోతే బ్యాటర్లకు కూడా కాస్త అనుకూలించొచ్చు. రెండో రోజు కొద్దిపాటి వర్ష సూచన ఉన్నా మిగతా రోజుల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది.

తుది జట్లు

ఇండియా (అంచనా) :  జైస్వాల్, రోహిత్ (కెప్టెన్), రాహుల్, శుభ్‌‌‌‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్‌‌‌‌‌‌‌‌), జడేజా, నితీశ్‌‌‌‌ రెడ్డి/సుందర్, ఆకాష్ దీప్, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా : ఖవాజా, కొన్‌‌‌‌స్టస్, లబుషేన్‌‌‌‌, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (కీపర్‌‌‌‌‌‌‌‌), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, బోలాండ్, లైయన్‌‌‌‌.