T20 World Cup 2024: సౌతాఫ్రికాతో ఫైనల్ సమరం.. బార్బడోస్ చేరుకున్న టీమిండియా

T20 World Cup 2024: సౌతాఫ్రికాతో ఫైనల్ సమరం.. బార్బడోస్ చేరుకున్న టీమిండియా

టీ20 వరల్డ్ కప్ లో 10 ఏళ్ళ తర్వాత టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. గురువారం (జూన్ 27) అర్దరాత్రి ఇంగ్లాండ్ పై ముగిసిన సెమీ ఫైనల్లో భారత్ 68 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ రాణించడం.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లాండ్ చిత్తు చేసి 2022 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. భారత కాలమాన ప్రకారం శనివారం (జూన్ 29) బార్బడోస్ లో ఫైనల్ జరుగుతుంది. తుది సమరంలో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 

ఈ ఫైనల్ కోసం తాజాగా భారత క్రికెటర్లు  బార్బడోస్ నగరానికి చేరుకున్నారు. ఒక్క రోజే గ్యాప్ ఉండడంతో భారత క్రికెటర్లు రెస్ట్ తీసుకోనున్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరుకోవడం ఇది మూడో సారి కాగా.. దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి. ఇప్పటివరకు వరల్డ్ కప్ ట్రోఫీ లేని సఫారీలు టైటిల్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు భారత్ 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్కించుకోవాలని ఆరాటపడుతుంది. 

ఈ ట్రోఫీ భారత్ గెలిస్తే రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న మూడో జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్నాయి. సౌతాఫ్రికా గెలిస్తే వారికి ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ అవుతుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ శనివారం (జూన్ 29) సాయంత్రం 8 గంటలకు జరుగుతుంది.