చెన్నై: టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన టీమిండియా సూపర్ స్టార్లు మళ్లీ మైదానంలోకి వచ్చారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్లకు పని చెప్పారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రోహిత్ గురువారం చెన్నై చేరుకోగా, కోహ్లీ డైరెక్ట్‌గా లండన్ నుంచి శుక్రవారం ఉదయం నగరానికి వచ్చాడు. స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌తో పాటు మిగతా జట్టు సభ్యులు ముందే ఇక్కడికి చేరుకున్నారు. విరామం తర్వాత ప్లేయర్లందరూ చెపాక్ స్టేడియంలో తేలికపాటి వ్యాయామాలు చేశారు. ఆ తర్వాత టీమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఈ సెషన్‌లో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన తోటి ఆటగాళ్లకు సలహాలు, సూచనలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో ఆడిన వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ దాదాపు 45 నిమిషాల పాటు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడటంతో గంభీర్ కోచింగ్‌పై కాస్త ఒత్తిడి నెలకొంది.
దీంతో ఈ సిరీస్‌పై కొత్త కోచింగ్ బృందం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. తన హయాంలో తొలి టెస్ట్ సిరీస్ కావడంతో గౌతీ కూడా కొత్త ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ కూడా దీటుగా జవాబిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య చెన్నైలోనే 19న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. 27 నుంచి కాన్పూర్ రెండో టెస్ట్‌కు ఆతిథ్యమివ్వనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఈ సిరీస్ కూడా భాగం కావడంతో ఇరు జట్లూ విజయంపైనే దృష్టి పెట్టాయి. ఈ సీజన్‌లో ఇండియా మొత్తం 10 టెస్ట్‌లు ఆడనుంది. బంగ్లాతో రెండు, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌లు ఇందులో ఉన్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇండియా 68.52 పర్సెంటేజ్ పాయింట్లతో టాప్ లో ఉండగా, బంగ్లా నాలుగో స్థానంలో ఉంది.
రేపు చెన్నైకి బంగ్లా జట్టు..
పాకిస్తాన్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గిన బంగ్లాదేశ్ కూడా తమ ప్రాక్టీస్‌ను ఆపలేదు. ఒకే ఒక్క మార్పుతో టీమిండియాతో సిరీస్‌కు ప్రకటించిన జట్టు ఢాకాలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ప్రతి ఒక్కరు ఫామ్‌లో ఉండటంతో ఎలాగైనా ఇండియాపై సిరీస్ గెలవాలని లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఆదివారం చెన్నై చేరుకోనుంది.