- తొలి ఇన్నింగ్స్‌లో 396 ఆలౌట్
- యశస్వి డబుల్ సెంచరీ
- ఆరు వికెట్లు పడగొట్టిన బుమ్రా
- 253 రన్స్‌కే కుప్పకూలిన ఇంగ్లిష్ టీమ్
విశాఖపట్నం: వైజాగ్‌లో టీమిండియా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ ఇంగ్లండ్‌ను ఓ ఆటాడుకుంటూ మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్ (290 బాల్స్‌లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209) డబుల్ సెంచరీతో దంచికొట్టగా.. ఫ్లాట్ పిచ్‌పై స్పీడ్ స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/45) ఆరు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ విలవిలలాడింది.
ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 వద్ద ఆలౌటైంది. ప్రతిగా బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ బుమ్రా దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలోనే 253 రన్స్‌కే కుప్పకూలింది. దాంతో ఇండియాకు 143 రన్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లిష్ టీమ్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ (76), కెప్టెన్ బెన్ స్టోక్స్ (47) పోరాడారు. బుమ్రాకు తోడు కుల్దీప్ యాదవ్ (3/71) మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం చివరి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన టీమిండియా రోజు చివరకు 5 ఓవర్లలో 28/0 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు యశస్వి (15 బ్యాటింగ్), రోహిత్ శర్మ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా ఇండియా 171 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో మూడ్రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో ఆదివారం మొత్తం బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి 400 ప్లస్ టార్గెట్ ఇస్తే రోహిత్‌సేన ఈజీగా గెలిచే అవకాశం ఉంది.
బుమ్రా తడాఖా
లంచ్‌కు ముందు తొలి ఇన్నింగ్స్‌కు వచ్చిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, డకెట్ (21) స్టార్టింగ్ నుంచే తమ బజ్‌బాల్ గేమ్ ఆడుతూ తొలి వికెట్‌కు 59 రన్స్ జోడించారు. లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో క్రాలీ నాలుగు ఫోర్లతో విజృంభించడంతో 9 ఓవర్లకే ఇంగ్లండ్ స్కోరు 50 దాటింది. అయితే, కుల్దీప్ మంచి టర్నింగ్ బాల్‌తో డకెట్‌ను పెవిలియన్ చేర్చి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. అయినా బర్త్ డే బాయ్ క్రాలీ వెనక్కుతగ్గలేదు. కుల్దీప్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్‌తో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్‌నూ టార్గెట్ చేశాడు. చివరకు అతని బౌలింగ్‌లోనే అయ్యర్ పట్టిన రన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి బుమ్రా హవా మొదలైంది.
అతని రివర్స్ స్వింగ్ బాల్‌ను అర్థం చేసుకోలేక రూట్ (5) స్లిప్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై బుమ్రా సూపర్ యార్కర్‌కు ఒలీ పోప్ (23) వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ బాల్ స్పీడ్‌కు రెండు వికెట్లు గాల్లోకి లేచాయి. కాసేపటికే ఓ ఇన్ స్వింగర్‌తో బెయిర్‌స్టో (25) బ్యాట్ నుంచి ఎడ్జ్ రాబట్టాడు. దాంతో ఓ దశలో 113/1తో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ 159/5తో కష్టాల్లో పడింది.
ఆపై పది రన్స్ తేడాతో బెన్ ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లిష్ టీమ్ 200లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో హార్ట్‌లీ (21)తో ఎనిమిదో వికెట్‌కు 47 రన్స్ జోడించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, బుమ్రా మరో మ్యాజిక్ బాల్‌తో స్టోక్స్ ఆఫ్ స్టంప్‌ను పడగొట్టాడు. ఈ బాల్‌కు స్టోక్స్ సైతం ఫిదా అయిపోయాడు. బ్యాట్ కింద పడేసి బుమ్రాను ప్రశంసిస్తున్నట్టు రెండు చేతులు పైకెత్తాడు. హార్ట్‌లీ, అండర్సన్ (6) కూడా బుమ్రాకే వికెట్లు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించింది.
డబుల్ ధమాకా
ఓవర్‌నైట్ స్కోరుకు మరో 60 రన్స్ జోడించిన ఇండియా మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు హోమ్ టీమ్‌ను ఆదుకున్న యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో రోజు అదే జోరు కొనసాగించాడు. ఆల్‌రౌండర్ అశ్విన్ (20) నుంచి అతనికి కాసేపు సపోర్ట్ లభించింది. స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో మంచి కవర్ డ్రైవ్స్‌తో అశ్విన్ బౌండ్రీలు కొట్టాడు.
కానీ, 41 ఏండ్ల వయసులోనూ ఫ్లాట్ వికెట్‌పై అద్భుతమైన సీమ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న అండర్సన్.. అశ్విన్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. బషీర్ ఓవర్లో ఫ్లాట్ సిక్స్ కొట్టి 190లోకి వచ్చిన యశస్వి.. అతని బౌలింగ్‌లోనే వరుసగా 6, 4తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండర్సన్ బౌలింగ్‌లో మరో షాట్‌కు ట్రై చేసి డీప్ కవర్‌లో బెయిర్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన యశస్వికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లూ అతడిని అభినందించారు. రెహాన్ బౌలింగ్‌లో బుమ్రా (6), బషీర్ ఓవర్లో ముకేశ్ (0) పెవిలియన్ చేరడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. అండర్సన్, బషీర్, రెహాన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన ఇండిమా బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. 34వ టెస్టులో ఈ మార్కు దాటిన అతను కపిల్ దేవ్ (39 టెస్టులు) రికార్డును బ్రేక్ చేశాడు.
తన ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లపై జైస్వాల్ రాబట్టిన రన్స్. 2002 తర్వాత ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లపై అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా కరుణ్ నాయర్ రికార్డు సమం చేశాడు.
టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో యంగెస్ట్ ఇండియన్ యశస్వి. 22 ఏండ్ల 36 రోజుల్లో అతను ఈ ఘనత సాధించాడు. వినోద్ కాంబ్లీ (21 ఏండ్ల 32 రోజులు), సునీల్ గావస్కర్ (21 ఏండ్ల 277 రోజులు) ముందున్నారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 112 ఓవర్లలో 396 ఆలౌట్ (యశస్వి 209, అండర్సన్ 3/47).
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 55.5 ఓవర్లలో 253 ఆలౌట్ (క్రాలీ 76, బుమ్రా 6/45).
ఇండియా రెండో ఇన్నింగ్స్: 5 ఓవర్లలో 28/0 (జైస్వాల్ 15 బ్యాటింగ్, రోహిత్ 13 బ్యాటింగ్) .