బెంగళూరు : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ అసామాన్యుడని అతని మోకాలికి ఆపరేషన్ చేసిన డాక్టర్ దిన్షా పరిడివాలా అన్నాడు. కారు ప్రమాదానికి సంబంధించిన సర్జరీల నుంచి 15 నెలల్లోనే కోలుకోవడం అద్భుతమన్నాడు. ‘మేం చేసిన సర్జరీల నుంచి కోలుకోవాలంటే కచ్చితంగా 18 నెలలు పడుతుంది. కానీ పంత్ 15 నెలల్లోనే కోలుకున్నాడు. అతనికి మానసిక ధైర్యం చాలా ఎక్కువ. రికవరీ ప్రక్రియ మేం అనుకున్నదానికంటే చాలా వేగంగా జరిగింది’ అని దిన్షా పేర్కొన్నాడు.
ఆపరేషన్ తర్వాత పంత్ కోలుకునే ప్రక్రియ చాలా కష్టతరంగా సాగిందన్నాడు. ‘సర్జన్లుగా, వైద్యులుగా మేం వాస్తవ పరిస్థితులను పేషెంట్ ఫ్యామిలీకి తెలియజేయాలి. ప్రమాదంలో పంత్ మోకాలి చిప్ప పూర్తిగా పక్కకు జరిగిపోయింది. దానికి సంబంధించిన చాలా గాయాలకు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో పంత్ నడవగలడో లేడోనని అతని తల్లి చాలా ఆందోళన చెందింది. అయితే మేం ఎలాగైనా పంత్‌ను నడిపిస్తామని హామీ ఇచ్చాం. కానీ అతన్ని మళ్లీ క్రికెట్ ఆడేలా చేయాలనే లక్ష్యంతోనే ఆపరేషన్స్ చేశాం. ఆ తర్వాత 12 నెలల్లోనే నడిచి చూపెట్టాడు. అదో అద్భుతం’ అని దిన్షా వ్యాఖ్యానించాడు.