సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు జరిమానా విధించింది . రెండు ఓవర్లు ఆలస్యంగా వేసినందుకు ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటుగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 2పాయింట్లు తగ్గించింది.
దీంతో పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా మొదటిస్థానంలో ఉండగా.. పాక్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
కాగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే ఆలౌటైంది.
ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ 2024 జనవరి మూడు నుంచి కేప్ టౌన్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో నైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది.