‘నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‎కు ఉగ్రవాదుల బెదిరింపులు

‘నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తాం’.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‎కు ఉగ్రవాదుల బెదిరింపులు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బైసారన్ మైదానం ప్రాంతంలో సరదగా గడుపుతోన్న అమాయక ప్రజలపై పాక్ టెర్రరిస్ట్ మూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపి సృష్టించిన నరమేధంపై దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కుతున్నాయి. పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ముష్కరుల ఏరివేత కోసం ఓ పక్కా భారత భద్రతా దళాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తుండగా.. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‎కు ఉగ్రవాదుల బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. 

గంభీర్‎ను అతడి ఫ్యామిలీని చంపేస్తామని ఉగ్రవాదులు మెయిల్స్ ద్వారా హెచ్చరించారు. తనను, తన ఫ్యామిలీ మెంబర్స్‎ను చంపేస్తామని రెండు మెయిల్స్ వచ్చినట్లు గౌతీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి దగ్గర బాంబ్ దాడులు చేస్తామని హెచ్చరించారని గౌతీ పేర్కొన్నాడు. ఐసీస్ కశ్మీర్‌ నుంచి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని తెలిపాడు. ఉగ్రవాదుల నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉన్న నేపథ్యంలో అదనపు భద్రతా కల్పించాలని ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. గంభీర్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

గౌతీకి వచ్చిన బెదిరింపు మెయిల్స్ డిటెయిల్స్ తీసుకున్న పోలీసులు.. మెయిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి..? ఎవరు పంపారు..? అనే దానిపై విచారణ చేపట్టారు. గంభీర్‎కు, అతడి ఫ్యామిలీకి సెక్యూరిటీ పెంచారు. గంభీర్ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాం టెర్రర్ ఎటాక్‎ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల్లోనే టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‎కు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది.