న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా బీసీసీఐ నుంచి కొనసాగింపు పొందిన రాహుల్ ద్రవిడ్ ఈ నెల సౌతాఫ్రికా టూర్ కోసం ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. అక్కడి పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం కష్టమని, బ్యాటర్లు గేమ్ ప్లాన్‌కు కట్టుబడి బాధ్యతగా ఆడటం ముఖ్యమని అంటున్నాడు. ‘సౌతాఫ్రికాలో బ్యాటింగ్ అంత ఈజీ కాదు. ముఖ్యంగా సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌లో మరింత సవాల్ ఎదురవుతుంది.
కాబట్టి ఈ టూర్‌లో ప్రతి బ్యాటర్‌కు నిర్దిష్ట గేమ్ ప్లాన్ అప్పగిస్తాం. వాళ్లు దానికి కట్టుబడి ముందుకెళ్తే మంచిది. అందరూ ఒకేలా ఆడాలని నేను ఆశించను. కానీ, తమకు అప్పగించిన పనిపై ప్రతి ఒక్కరూ క్లారిటీతో ఉండాలి. ప్లాన్‌ను పక్కాగా అమలు చేయగలగాలని అనుకుంటున్నా. క్రీజులోకి వెళ్లిన తర్వాత మానసికంగా బలంగా ఉండటం ముఖ్యం. ముందుగా క్రీజులో కుదురుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడొచ్చు’ అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 10న మొదలయ్యే ఈ టూర్‌లో ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ల్లో ఆతిథ్య సౌతాఫ్రికాతో తలపడనుంది.