- వచ్చే నెల 5 నుంచి మెగా టోర్నీ
బెంగళూరు : శ్రీలంక టూర్‌ను పూర్తి చేసుకున్న టీమిండియా 40 రోజుల పైనే ఖాళీగా ఉండనుంది. సెప్టెంబర్ 19న సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో మొదలయ్యే టెస్టు సిరీస్ వరకూ ఆటగాళ్లకు విశ్రాంతి లభించనుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముంగిట ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలో పలువురు టీమిండియా స్టార్లు పోటీ పడనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, బుమ్రా మినహా మిగిలిన సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు సెప్టెంబర్ 5న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో పోటీకి రెడీ అవుతున్నారు.
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌తో పాటు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్ ,రజత్ పాటిదార్ టోర్నీలోని నాలుగు జట్లలో స్పెషలిస్ట్ బ్యాటర్లుగా బరిలోకి దిగనున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ మహ్మద్ షమీని నేషనల్ టీమ్‌లో రీఎంట్రీకి ముందు దులీప్ ట్రోఫీలో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు అతడిని కోరే అవకాశం ఉంది.
ఇక, దులీప్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లను ముందుగా అనంతపూర్‌లో ప్లాన్ చేశారు. కానీ, టాప్ ప్లేయర్లు బరిలో ఉండటం, అనంతపురంకు ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడంతో ఈ రెండు మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించారు.