పోర్ట్స్‌మౌత్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. బ్యాచ్‌ల వారిగా లండన్ చేరిన ప్లేయర్లందరూ తమ కసరత్తులు ప్రారంభించారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు ఓవర్లకే పరిమితమైన బౌలర్లపై టీమ్ మేనేజ్‌మెంట్ ఎక్కువగా ఫోకస్ చేయనుంది. ఇందుకోసం వర్క్‌లోడ్ భారీగా పెంచాలని ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ఇంగ్లండ్ కండీషన్స్‌కు అలవాటు పడిన పేసర్లు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, ఉమేశ్ యాదవ్‌ల ప్రాక్టీస్ టైమ్ పెంచనుంది. వీళ్లు కనీసం 20 నుంచి 30 ఓవర్లు వేసే విధంగా కోచ్‌లు షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందుకోసం ససెక్స్‌లోని అరుండెల్ కాస్టిల్ క్రికెట్ క్లబ్‌లో అదనంగా మరో రెండు ప్రాక్టీస్ సెషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఐపీఎల్ ఫైనల్ సోమవారం రాత్రి ముగియడంతో పేసర్ మహ్మద్ షమీ కాస్త లేటుగా లండన్ చేరుకోనున్నాడు. ‘ఇప్పటి వరకు మా ప్రిపరేషన్స్ బాగా సాగుతున్నాయి. స్టార్టింగ్‌లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు అంతా సర్దుకున్నాయి. చివరి రెండు ప్రాక్టీస్ సెషన్‌లు మరింత సంతృప్తినిచ్చాయి. అయితే దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేం భావిస్తున్నాం. బౌలర్లకు కొంచెం పనిభారం పెంచి వాళ్లను టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధం చేయాలి. వాతావరణం నిలకడగా ఉంది’ అని బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే పేర్కొన్నాడు.
రోహిత్ ప్రాక్టీస్ షురూ..
ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లండన్‌కు వచ్చేశాడు. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాతో కలిసి అతను కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్ డ్రిల్, క్లోజింగ్ క్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తెలిపాడు. ‘ప్లేయర్లందరూ ఐపీఎల్ నుంచి వస్తున్నారు. కాబట్టి మేం వాళ్లను టెస్ట్‌లకు అనుకూలంగా మలచాలి. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై కూడా ఫోకస్ పెంచాలి. ఐపీఎల్‌లో గ్రౌండ్, ఫీల్డింగ్ విషయాలతో పోలిస్తే టెస్ట్‌ల్లో చాలా భిన్నంగా ఉంటాయి. స్లిప్, క్లోజ్, ఫ్లాట్ క్యాచ్‌లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. క్యాచ్‌లతోనే సగం మ్యాచ్‌ను టర్న్ చేయొచ్చు’ అని దిలీప్ వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ సెషన్స్ వల్ల ఫీల్డింగ్‌ను మెరుగుపర్చాలని భావిస్తున్నామన్నాడు. ‘మాకు ఇప్పుడు రెండు సెషన్స్ ఉన్నాయి. రెండో సెషన్‌లో బౌలర్లతో కలిసి ఎక్కువగా పని చేయాలి. టెస్ట్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు టీమ్ ఎంపిక ఉంటుంది. పిచ్, అప్పటి పరిస్థితులను బట్టి బౌలర్లను తీసుకుంటాం. మరో మూడు, నాలుగు సెషన్లలో బౌలర్లపై పూర్తి అవగాహనకు వస్తాం. ప్రతి సెషన్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ను వేసేలా ప్రయత్నిస్తాం’ అని దిలీప్ పేర్కొన్నాడు. టెస్ట్‌ల్లో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడంపై బ్యాటర్లు దృష్టి పెట్టాలని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు.