బ్యాటింగ్‌లో తడబడి.. రెండో వన్డేలో ఇండియా ఓటమి

బ్యాటింగ్‌లో తడబడి.. రెండో వన్డేలో ఇండియా ఓటమి

గెబెహా: బ్యాటింగ్‌‌లో ఫెయిలైన టీమిండియా.. సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ఇరుజట్లు 1–1తో నిలిచాయి. టాస్‌‌ ఓడిన ఇండియా  తొలుత 46.2 ఓవర్లలో 211 రన్స్‌‌కు ఆలౌటైంది. ఓపెనర్ సాయి సుదర్శన్‌‌ (83 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 62), కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (64 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 56) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. 

సఫారీ బౌలర్లు నాండ్రీ బర్గర్‌‌ (3/30), హెండ్రిక్స్‌‌ (2/34), కేశవ్‌‌ మహారాజ్‌‌ (2/51) ధాటికి రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (4), తిలక్‌‌ వర్మ (10), సంజూ శాంసన్‌‌ (12), రింకూ సింగ్‌‌ (17), అక్షర్‌‌ (7), కుల్దీప్‌‌ (7), అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ (18), అవేశ్‌‌  (9) పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. తర్వాత ఛేజింగ్‌‌లో టోనీ డి జోర్జీ (122 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 119 నాటౌట్‌‌) సెంచరీతో చెలరేగడంతో.. సౌతాఫ్రికా 42.3 ఓవర్లలో 215/2 స్కోరు చేసి గెలిచింది. రీజా హెండ్రిక్స్‌‌ (52), డసెన్‌‌ (36) రాణించారు. అర్ష్‌‌దీప్‌‌ ఒక వికెట్‌‌ తీశాడు. జోర్జీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో, చివరి వన్డే పార్ల్‌‌లో గురువారం జరుగుతుంది.