- తన నివాసంలో ఆటగాళ్లను అభినందించనున్న ప్రధాని
- సాయంత్రం ముంబైలో ఓపెన్ టాప్ బస్‌లో విక్టరీ పరేడ్
- వాంఖడేలో టీమిండియాకు బీసీసీఐ సత్కారం
ముంబై: టీ20 వరల్డ్ కప్ నెగ్గి.. కోట్లాది మంది అభిమానుల కలను నిజం చేసిన టీమిండియా వీరులు స్వదేశానికి వచ్చేస్తున్నారు. కలల కప్పును చేతిలో పట్టుకొని గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు. 17 ఏండ్ల తర్వాత టీ20 కప్పు నెగ్గిన టీమిండియాకు అపూర్వ స్వాగతం పలికేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. విండీస్ వేదికగా శనివారం జరిగిన మెగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన రోహత్ సేన భారీ తుఫాను కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోయింది.
తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం మెరుగవ్వడంతో ఇండియా ఆటగాళ్లు బుధవారం సాయంత్రం స్థానిక గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బీసీసీఐ పంపించిన ఎయిరిండియా స్పెషల్ ఫ్లైట్ (బోయింగ్ 777) ఎక్కారు. ఈ భారీ విమానానికి బోర్డు ‘ఎయిరిండియా చాంపియన్స్ 24 వరల్డ్ కప్’ (ఏఐసీ24డబ్ల్యూసీ) అని పేరు పెట్టింది. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా ఈ ఫ్లైట్‌లోనే స్వదేశానికి వస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు సూర్యతో కలిసి ట్రోఫీ పట్టుకొని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కెప్టెన్ రోహిత్ ‘ఇంటికి వస్తున్నాం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. వాస్తవానికి టీమిండియా బుధవారం రాత్రి 7.45 నిమిషాలకు ఢిల్లీ చేరుకోవాలి. కానీ, బీసీసీఐ న్యూయార్క్ నుంచి పంపించిన ప్రత్యేక విమానం బార్బడోస్‌కు లేట్‌గా రావడంతో షెడ్యూల్ మారింది.
నారీమన్ పాయింట్ నుంచి ర్యాలీ
మోదీతో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లి సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి మెరైన డ్రైవ్ రోడ్డు మీదుగా వాంఖడే స్టేడియం దాకా సుమారు రెండు కిలో మీటర్లు దూరం ఓపెన్ టాప్ బస్‌లో వరల్డ్ కప్ వీరులతో బీసీసీఐ విక్టరీ పరేడ్‌కు ఏర్పాట్లు చేసింది. 2007 టీ20 వరల్డ్ కప్ నెగ్గినప్పుడు ధోనీ నేతృత్వంలోని జట్టు కూడా ఇలానే ఓపెన్ టాప్ బస్‌లో విక్టరీ పరేడ్‌లో పాల్గొంది. రోహిత్‌సేన విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు.
‘మేము ఈ ప్రత్యేక క్షణాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ విక్టరీ పరేడ్, వాంఖడేలో పాల్గొని మాతో పాటు ఈ విజయాన్ని ఆస్వాదించండి’ అని పిలుపునిస్తూ రోహిత్ ట్వీట్ చేశాడు. దాదాపు రెండు గంటల పాటు జరిగే ర్యాలీ ముగిశాక వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది సత్కారించనుంది. రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీనిఈ కార్యక్రమంలో ప్లేయర్లకు అందచేస్తుందని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
టీమిండియా షెడ్యూల్
- ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్
- ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి మోదీ ఇంటికి
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12 గంటల దాకా మోదీతో సమావేశం
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి ప్రయాణం
- సాయంత్రం 4 గంటలకు ముంబైకి రాక
- సాయంత్రం 5 నుంచి ముంబై నారీమన్ పాయింట్ నుంచి విక్టరీ పరేడ్ మొదలు
- రాత్రి 7- 7.30 గంటల మధ్య వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారం, రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ అందజేత
మోదీ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగనున్న ఇండియా ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసానికి వెళ్లనుంది. రెండు గంటల పాటు ప్రధానితో సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో జట్టును అభినందించనున్న మోదీ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు.