IND vs ENG: ఆ ఒక్క స్థానంపై టీమిండియా గందరగోళం.. తెలుగోడికి గట్టి పోటీ ఇస్తున్న తమిళ క్రికెటర్

IND vs ENG: ఆ ఒక్క స్థానంపై టీమిండియా గందరగోళం.. తెలుగోడికి గట్టి పోటీ ఇస్తున్న తమిళ క్రికెటర్

భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 సమరం నేటితో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నేడు (జనవరి 22) కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే తొలి మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. రెండు అగ్ర శ్రేణి జట్ల మధ్య మ్యాచ్ జరగనుండడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ను ప్రకటించగా భారత్ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో ఆసక్తిగా మారింది. 

నితీష్ రెడ్డికి సుందర్ గట్టి పోటీ:

 ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి జట్టుతో దిగబోతుందో దాదాపు ఖరారైంది. కానీ ఒక్క స్థానం కోసం ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. తెలుగు యువ క్రికెటర్ నితీష్ రెడ్డి, వాషింగ్ టన్ సుందర్ లలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది. ఇద్దరూ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా.. హార్దిక్ పాండ్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా జట్టులో ఉంటారు. ఏడో స్థానంలో సుందర్ లేదా నితీష్ ఒకరే ఆడనున్నారు. బ్యాటింగ్ బాగా చేయగలడు కాబట్టి ఈ నితీష్ కు అవకాశం దక్కొచ్చని అందరూ భావించారు.    

ఇక్కడే కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనూకూలిస్తుంది. దీంతో సుందర్ కు ఛాన్స్ దక్కొచ్చని మరికొందరు భావిస్తున్నారు. భారత జట్టులో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. సుందర్ తోడైతే టీమిండియాకు తిరుగుండదు. స్పిన్ ఆడడంలో బలహీనంగా ఉన్న ఇంగ్లాండ్.. సుందర్ ను ఎదుర్కోవడం కష్టమే. దీంతో సుందర్ అవకాశాలను కొట్టి పారేయలేం. తుది జట్టును  సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు టాస్ తర్వాత ప్రకటించనున్నారు. 

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగనున్నారు. మూడు నాలుగు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ ఆడతారు. ఆల్ రౌండర్లు గా హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ జట్టులో ఉండడం ఖాయం. ఫినిషర్ గా రింకూ సింగ్ కొనసాగనున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ షమీతో పాటు అర్షదీప్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. ఏకైక స్పిన్నర్ గా సౌతాఫ్రికా సిరీస్ లో అద్భుతంగా రాణించిన వరుణ్ కే ప్లేయింగ్ 11 లో చోటు దక్కొచ్చు.