చెన్నై: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ స్పీడు పెంచింది. సోమవారం చెన్నై చెపాక్ స్టేడియంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా 16 మంది ప్లేయర్లు చెమటలు చిందించారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా ఫీల్డింగ్ ప్రాక్టీస్ తర్వాత విడతల వారీగా నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆటగాళ్లతో ప్రత్యేక డ్రిల్స్ చేయించాడు.
మొదటి సెట్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీతో పాటు పక్క నెట్‌లో యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్.. బుమ్రా, అశ్విన్‌ను ఎదుర్కొంటూ కనిపించారు. తర్వాతి సెట్ బ్యాటర్లలో రోహిత్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. చెన్నై స్పిన్ వికెట్‌ను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్ రోహిత్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టాడు.
రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌తో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్.. లోకల్ బౌలర్లు, త్రౌ డౌన్స్ ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. మరోవైపు ఆదివారం చెన్నైకి చేరుకున్న బంగ్లాదేశ్ సోమవారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. గురువారం తొలి టెస్టు మొదలవుతుంది.