ఐపీఎల్.. ఐపీఎల్.. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోట విన్నా ఇదే పాట. దేశానికి వరల్డ్ కప్ రాకపోయినా పర్లేదు కానీ, తమ అభిమాన జట్టు మాత్రం ఐపీఎల్ టైటిల్ నెగ్గాల్సిందే. ఇదెక్కడి చోద్యమో ఎవరికీ అర్థం కాదు.. ఆటగాళ్లు సైతం అంతే. దేశానికి ఆడండ్రా అయ్యా..! అంటే ఎక్కడలేని కుంటిసాకులు చెబుతారు. ఒకరు గాయమని చెబితే, మరొకరు విశ్రాంతి అంటారు. ఇంకొకరు కుటుంబ సమస్య అంటారు. అదే ఐపీఎల్‌కు వచ్చేసరికి ఇవేవీ అడ్డంకులు కావు. ఇదంతా పక్కనపెడితే.. మెగా లీగ్ ముగిసిన ఐదు రోజుల్లోనే(అనగా జూన్ 1 నుంచి) టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి ప్రపంచ కప్‌లో తలపడే భారత జట్టులో ఎవరుంటారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఆ ముగ్గురికి కష్టమే..!
యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను వెలికితీయడమే ఐపీఎల్ లక్ష్యం. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తప్పక వస్తారు. యశస్వి జైశ్వాల్, సూర్య, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు అలా వెలుగులోకి వచ్చినవారే. ఏ చోటాకెళ్లినా బీసీసీఐ పెద్దలు చెప్పే మాటలివి. అదీ వాస్తవమే.. కాదనలేం. మరి, ఈ ఏడాది సంగతేంటి..? ప్రస్తుతం పొట్టి లీగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కుతుందా..! అంటే కష్టం. కాదంటారా.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముగ్గురు ఆటగాళ్లలో ఏ ఒక్కరికైనా చోటు దక్కే అవకాశాలు ఉన్నాయా.. చూద్దాం..
శివం దూబే
చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న శివం దూబే ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. నిలకడగా రాణించడమే కాదు, భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. 34*, 51, 18, 45.. గత 4 ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లివి. గతేడాది టోర్నీ అమాంతం అతను ఇలాంటి ప్రదర్శనే చేశాడు. కానీ, సరైన అవకాశాలు దక్కలేదు. ఆసియన్ గేమ్స్‌లో భాగంగా చైనా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో తప్ప, అతను కనిపించిందే లేదు. పోనీ, ఈసారైనా అదృష్టం వరించేనా..! అంటే అదీ లేదు. ఎందుకు అంటే సీనియర్లు.
రియాన్ పరాగ్
ప్రస్తుత సీజన్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటీపడి పరుగులు చేస్తున్న యువ బ్యాటర్ ఎవరంటే.. రియాన్ పరాగ్. మైదానంలో ఇతని ప్రవర్తన కాస్త శృమించినా.. పరుగుల వేటలో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. విదేశీ బౌలర్లను సైతం ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 100కు పైగా సగటుతో 261 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే జట్టులో చోటివ్వాలి. మరి, దక్కుతుందా.. దక్కదు. ఎందుకు అంటే సీనియర్లు.
మయాంక్ యాదవ్
భారత జట్టుకు పేసర్ల కొరత ఉన్నమాట వాస్తవం. గంటకు 150కిపైగా వేగంతో నిలకడగా బంతులు విసిరే బౌలర్ కోసం ఎప్పటినుంచో అన్వేషణ సాగుతోంది. గతేడాది ఉమ్రాన్ మాలిక్ తన పేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించినా.. సరైన లెన్త్‌లో బౌలింగ్ చేయక జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అతని రూపంలో వెలుగులోకి వచ్చిన మరొక స్పీడ్ గన్.. మయాంక్ యాదవ్. ఈ కుర్ర బౌలర్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే స్టార్ అయిపోయాడు. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే అత్యంత వేగవంతమైన బంతులు(156 kmph, 157 kmph) విసిరి రికార్డుల మోత మోగించాడు. మరి, భారత జట్టులో చోటు దక్కుతుందా.. అంటే కష్టం. ఎందుకు అంటే సీనియర్లు.
కోహ్లీ, రోహిత్‌ను తప్పించలేరు
గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో పరాభవం తరువాత భారత జట్టులో అనేక మార్పులు జరుగుతాయని అందరం ఊహించాం.. అనుకున్నట్లుగానే మెగా టోర్నీ అనంతరం జరిగిన టీ20 సిరీస్‌లకు కుర్రాళ్లను ఎంపిక చేశారు. దానిని బట్టి పొట్టి ప్రపంచ కప్‌లో తలపడేది కుర్రాళ్లే అనుకున్నాం.. తీరా మూణ్నెళ్లు గడిచాక చూస్తే.. మళ్లీ పాత కథే. అదే జట్టు. ఎలాంటి పరిస్థితిలోనైనా రాణించగల సత్తా ఉన్నా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లను జట్టు నుంచి తప్పించే పరిస్థితి లేదు. ఒకవేళ కాదని తప్పిస్తే వారు అభిమానులు ఊరుకోరు. ఈ విషయంలో సెలెక్టర్లూ ఏమి చేయలేకపోతున్నారు.
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.