- సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం
- రాణించిన మంధాన, రేణుక
- రేపు లంకతో టైటిల్ ఫైట్
దంబుల్లా : విమెన్స్ ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో సూపర్ పెర్ఫామెన్స్ కొనసాగిస్తున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బౌలింగ్‌లో పేసర్ రేణుకా సింగ్ (3/10), బ్యాటింగ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (39 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 55 నాటౌట్) విజృంభించడంతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 80/8 స్కోరు మాత్రమే చేసింది. నిగర్ సుల్తానా (32), షోర్నా అక్తర్ (19 నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు.
ఇండియా బౌలర్లలో రేణుకతో పాటు రాధా యాదవ్ (3/14) కూడా సత్తా చాటింది. ఛేజింగ్‌లో మంధాన మెరుపులకు తోడు షెఫాలీ వర్మ (26 నాటౌట్) నిలకడగా ఆడటంతో ఇండియా 11 ఓవర్లలోనే 83/0 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఈ క్రమంలో టీ20ల్లో ఇండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా(3433) రికార్డు సృష్టించింది. హర్మన్‌ప్రీత్ (3415)ని వెనక్కునెట్టింది. రేణుకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఆఖరి బాల్‌కు ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో ఇండియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ : 20 ఓవర్లలో 80/8 (నిగర్ 32, రేణుక 3/10, రాధ 3/14)
ఇండియా : 11 ఓవర్లలో 83/0 (మంధాన 55 నాటౌట్, షెఫాలీ 26 నాటౌట్).