- నెట్స్‌లో 4 గంటల పాటు సాధన
- శుక్రవారం నుంచి ఆసీస్‌తో డే నైట్ టెస్టు
అడిలైడ్ : తొలి టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్‌తోనూ కంగారూల పని పట్టేందుకు రెడీ అవుతోంది. శుక్రవారం మొదలయ్యే రెండో, డే నైట్ టెస్టు కోసం అడిలైడ్‌లో మంగళవారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఇండియా నుంచి తిరిగొచ్చిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమక్షంలో ఆటగాళ్లు మధ్యాహ్నం సెషన్‌లో నాలుగు గంటల పాటు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇప్పటికే ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో పింక్ బాల్ వామప్ గేమ్ ఆడిన టీమిండియా ప్లేయర్లు ఈ బంతిపై మరింత పట్టు సాధించే ప్రయత్నం చేశారు.
రిషబ్ పంత్, ఆకాశ్ దీప్, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ జట్టు కంటే గంట ముందుగానే గ్రౌండ్‌లోకి వచ్చి రెండు స్పెల్స్‌లో బ్యాటింగ్ చేశాడు. మొదటగా రోహిత్, పంత్ నెట్స్‌లోకి వెళ్లారు. బాల్స్‌ను వదిలేయడంపై ఫోకస్ పెట్టిన రోహిత్ బాడీకి క్లోజ్‌గా వచ్చిన వాటినే ఆడుతూ కనిపించాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో పింక్ బాల్‌ను అంచనా వేసే విషయంలో కెప్టెన్ ఒక్కోసారి తడబడినా సెషన్‌ను సంతృప్తిగానే ముగించాడు.
ఇంకోవైపు రిషబ్ పంత్ తనదైన శైలిలో షాట్లు కొట్టాడు. ఆకాశ్ దీప్ కొన్ని పదునైన బంతులతో పంత్‌ను పరీక్షించాడు. యశ్ దయాల్, నవదీప్ సైనీ కూడా పంత్‌కు బౌలింగ్ చేశారు. 40 నిమిషాల తర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లతో కలిసి పంత్, రోహిత్ మెయిన్ గ్రౌండ్‌కు వెళ్లి వామప్స్ చేశారు.
కోహ్లీ వర్సెస్ బుమ్రా
వామప్ తర్వాత ప్లేయర్లంతా నెట్స్‌లోకి వెళ్లి ఫుల్ స్వింగ్‌లో ప్రాక్టీస్ చేశారు. నాలుగు నెట్స్‌లో వరుసగా యశస్వి జైస్వాల్–కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్–విరాట్ కోహ్లీ, రోహిత్–పంత్, నితీశ్ రెడ్డి–సుందర్ జంటలుగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత ప్లేయర్లు నెట్స్ మారారు. అయితే, నాలుగు నెట్స్‌లోనూ బ్యాటర్లంతా బంతిని వదిలేయడంపైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఆఫ్‌స్టంప్ చానెల్‌లో పడ్డ డెలివరీల విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో కోహ్లీ, గిల్ మంచి షాట్లు కొట్టారు. విరాట్ కొట్టిన కవర్ డ్రైవ్ చూసి ఫ్యాన్స్ గట్టిగా అరిచారు.
గాయం నుంచి కోలుకున్న గిల్ ఆకాశ్ దీప్, హర్షిత్ బౌలింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడు. ఈ సెషన్‌లో కోహ్లీ–బుమ్రా ప్రాక్టీస్ హైలైట్‌గా నిలిచింది. తొలుత జస్‌ప్రీత్ వేసిన చాలా బంతులను విరాట్ ఆడకుండా వదిలేశాడు. ఓ బాల్‌ను బ్యాక్ ఫుట్ పంచ్‌తో షాట్ కొట్టాడు. పింక్ బాల్‌తో పిచ్‌పై మంచి మూవ్‌మెంట్ రాబట్టిన బుమ్రా.. పంత్, యశస్వి జైస్వాల్ బ్యాట్ల నుంచి ఎడ్జ్‌లు రాబట్టాడు.
తన స్పీడ్‌తో కెప్టెన్ రోహిత్‌ను కూడా కాస్త కంగారుపెట్టాడు. సెషన్ ముగిసిన తర్వాత గిల్ ఫ్లడ్‌లైట్స్ కింద ఇంకోసారి ప్రాక్టీస్ చేశాడు. మొత్తంగా రెండు గంటల పాటు నెట్స్‌లో ఉన్న అతను ఎక్కడా ఇబ్బంది పడలేదు. సోమవారమే సాధన మొదలు పెట్టిన ఆస్ట్రేలియా రెండో రోజు మార్నింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేసింది.
అభిమానుల అరుపులతో ఆటగాళ్ల ఇబ్బంది
అడిలైడ్‌లో ఓపెన్ నెట్ సెషన్ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు. ఫ్యాన్స్ నిలబడ్డ ఐదు మీటర్ల దూరంలోనే మొదటి నెట్ ఉంది. దాంతో తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరగా చూసిన ఫ్యాన్స్ పట్టరాని ఆనందంలో మునిగిపోయారు.
వాళ్ల అరుపులతో ప్లేయర్లు ఇబ్బందిపడ్డారు. రెండో స్పెల్‌లో నెట్ ప్రాక్టీస్‌కు వచ్చిన రోహిత్ తన బాడీకి దగ్గరగా వెళ్లే బాల్స్‌ను ఎటాక్ చేశాడు. ఈ క్రమంలో కొన్ని స్ట్రోక్స్‌తో పాటు పుల్ షాట్స్ కొట్టాడు. మరిన్ని పుల్ షాట్స్ కొట్టాలంటూ ఫ్యాన్స్ అరవడంతో సైలెంట్‌గా ఉండాలంటూ రోహిత్ వారిని వారించాడు.