టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్ సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల్లో గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఈ ఇరు జట్ల మధ్య గత ఐసీసీ ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఐసీసీ ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడటం ఇది నాలుగో సారి. గతంలో మూడు సంధర్భాల్లో ఈ ఇరు జట్లు తలపడగా.. టీమిండియా ఒక్కసారి మాత్రమే ఇంగ్లీష్ జట్టుపై విజయం సాధించింది. అది కూడా 1983లో..
1983:
జూన్ 22న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన 1983 ప్రపంచ కప్ మొదటి సెమీఫైనల్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 6 వికెట్ల తేడాతో.. బాబ్ విల్లీస్ సారథ్యంలోని ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 213 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఆ లక్ష్యాన్ని కపిల్ సేన 4 వికెట్లు కోల్పోయి 54.4 ఓవర్లలో ఛేదించింది. యశ్‌పాల్ శర్మ (61), సందీప్ పాటిల్ (51*) హాఫ్ సెంచరీలు చేశారు.
1987:
నవంబర్ 5న ముంబై వేదికగా జరిగిన 1987 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మైక్ గాటింగ్ సేన 254 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత జట్టు 45.3 ఓవర్లలో 219 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మహ్మద్ అజారుద్దీన్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
2022:
నవంబర్ 10న అడిలైడ్ వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో భారత్‌పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట రోహిత్ శర్మ సేన నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఇంగ్లీష్ ఓపెనర్లు జోస్ బట్లర్(80*) అలెక్స్ హేల్స్(86*) వికెట్ నష్టపోకుండా చేధించారు. అనంతరం ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నారు.