బంగ్లాదేశ్ పై ఇండియా విక్టరీ ..సెమీఫైనల్ బెర్త్ ఖాయం

బంగ్లాదేశ్ పై ఇండియా విక్టరీ ..సెమీఫైనల్ బెర్త్ ఖాయం
  • 50 రన్స్‌‌ తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ
  • సత్తా చాటిన పాండ్యా, కుల్దీప్, బుమ్రా
  • రోహిత్‌‌సేనకు సెమీస్ బెర్తు ఖాయం

టీ20 వరల్డ్ కప్‌‌లో టీమిండియా సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. సూపర్‌‌-8 రౌండ్‌‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌‌లో 50  రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసింది.  ఇండియా 20 ఓవర్లలో 196 స్కోరు చేయగా.. బంగ్లాదేశ్​ 146 రన్స్​ మాత్రమే చేసి ఓడింది.

నార్త్‌‌ సౌండ్ (అంటిగ్వా): టాపార్డర్‌‌‌‌ టచ్‌‌లోకి వచ్చింది. మిడిలార్డర్ మెప్పించింది. బౌలింగ్ విభాగం ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తంగా ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టిన టీమిండియా  టీ20 వరల్డ్ కప్‌‌లో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. హార్దిక్ పాండ్యా (27 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్‌‌; 1/32)కు తోడు కుల్దీప్ యాదవ్ (3/19), జస్‌‌ప్రీత్ బుమ్రా (2/13), అర్ష్‌‌దీప్ సింగ్ (2/30) సత్తా చాటడంతో  సూపర్‌‌–‌‌8 రౌండ్‌‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా  50  రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసింది.  

వరుసగా రెండో విక్టరీతో  గ్రూప్‌‌–1లో టాప్ ప్లేస్‌‌లో నిలిచింది. వన్‌‌సైడ్‌‌ మ్యాచ్‌‌లో మొదట బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 196/5 భారీ స్కోరు చేసింది.  విరాట్ కోహ్లీ (28 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 37), రిషబ్ పంత్ (24 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), శివం దూబే (24 బాల్స్‌‌లో 3 సిక్సర్లతో 34) రాణించారు. బంగ్లా బౌలర్లలో  తంజిమ్ హసన్, రిషద్ హుస్సేన్‌‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఛేజింగ్‌‌లో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 146/8  స్కోరు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (40), తంజిద్ హసన్ (29), రిషద్‌‌ హుస్సేన్ (24) పోరాడినా ఫలితం లేకపోయింది.  పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా రెండు ఓటములతో బంగ్లా నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. సోమవారం జరిగే సూపర్8 చివరి మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియాతో ఇండియా పోటీ పడుతుంది. 

పాండ్యా ఫటాఫట్

కీలక మ్యాచ్‌‌లో టాపార్డర్‌‌‌‌తో పాటు మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్లు సత్తా చాటడంతో  రోహిత్‌‌ సేన భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన జట్టుకు ఓపెనర్లు రోహిత్‌‌ శర్మ, విరాట్ కోహ్లీ తొలిసారి మంచి ఆరంభం ఇచ్చారు.  తొలి ఓవర్లోనే బౌండ్రీల ఖాతా తెరిచిన హిట్‌‌మ్యాన్ స్పిన్నర్ షకీబ్ వేసిన రెండో ఓవర్లో మరో ఫోర్ కొట్టగా.. విరాట్ మిడ్ వికెట్‌‌ మీదుగా సిక్స్ రాబట్టాడు.

షకీబ్ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్ 6, 4తో జోరు మీద కనిపించాడు. కానీ, తర్వాతి బాల్‌‌కే మరో షాట్‌‌కు ప్రయత్నించి ఔటవడంతో తొలి వికెట్‌‌కు 39 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్‌‌ అయింది. కాసేపు నెమ్మదించిన కోహ్లీ.. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో సిక్స్‌‌తో మళ్లీ వేగం పెంచగా పవర్ ప్లేను ఇండియా 53/1తో ముగించింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన పంత్ క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకోగా.. స్పిన్నర్ రిషద్ హుస్సేన్‌‌ బౌలింగ్‌‌లో స్ట్రెయిట్ సిక్స్‌‌తో  కోహ్లీ అలరించాడు. కానీ, తొమ్మిదో ఓవర్లో పేసర్ తంజిద్ ఇండియాను దెబ్బకొట్టాడు.  

కోహ్లీని బౌల్డ్‌‌ చేసిన అతను ఎదుర్కొన్న తొలి బాల్‌‌నే సిక్స్‌‌గా మలచిన ఇన్‌‌ఫామ్ బ్యాటర్‌‌‌‌ సూర్య (6)ను కీపర్‌‌‌‌ క్యాచ్‌‌తో వెనక్కు పంపడంతో ఇండియా 77/3తో  కాస్త డీలా పడింది. అయితే, అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన పంత్.. ముస్తాఫిజుర్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 4తో స్పీడు పెంచాడు. రిషద్ బౌలింగ్‌‌లో 6,4తో స్కోరు వంద దాటించిన అతను తర్వాతి బాల్‌‌కే తంజిమ్‌‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌‌గా వెనుదిరిగాడు.

వరుసగా రెండు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వని బంగ్లా బౌలర్లు పుంజుకున్నట్టు కనిపించారు. కానీ, వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌‌లోకి వచ్చిన దూబేకు తోడైన హార్దిక్ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. స్పిన్నర్ మెహిదీ హసన్ బౌలింగ్‌‌లో 6, 4తో ఇండియా ఫ్యాన్స్‌‌లో జోష్ నింపాడు. షకీబ్, తంజిమ్ ఓవర్లలో దూబే రెండు సిక్సర్లు కొట్టి స్కోరు 150 దాటించాడు.

రిషద్ వేసిన 18వ ఓవర్లో మరో సిక్స్ కొట్టి బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్‌‌‌‌తో పాటు తంజిమ్ బౌలింగ్‌‌లో రెండు సిక్సర్లు బాదిన పాండ్యా.. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు సహా 18 రన్స్‌‌ రాబట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో ఇన్నింగ్స్‌‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. 

కుల్దీప్ కమాల్

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌లో బంగ్లాదేశ్‌‌ తొలి సగం ఓవర్లలో బాగానే  ప్రతిఘటించినా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన ఇండియా ఆ జట్టును నిలువరించింది. మొదట్లో ఓపెనర్లు  తంజిద్ హసన్ , లిటన్ దాస్ (13) ధాటిగా ఆడారు. స్వేచ్ఛగా బౌండ్రీలు కొడుతూ తొలి వికెట్‌‌కు 35 రన్స్‌‌ జోడించారు. తన బౌలింగ్‌‌లో సిక్స్‌‌ కొట్టిన లిటన్‌‌ను తర్వాతి బాల్‌‌కే ఔట్‌‌ చేసిన హార్దిక్ ఇండియాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు.

ఇక్కడి నుంచి ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. అయితే, హార్దిక్ వేసిన తొమ్మిదో ఓవర్లో కెప్టెన్ నజ్ముల్ శాంటో  రెండు సిక్సర్లతో  ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా జోరుకు బ్రేకులు వేశాడు.  తంజిద్‌‌,  తౌహిద్ హృదయ్ (4)ను ఎల్బీ చేసిన అతను .. రోహిత్ పట్టిన క్యాచ్‌‌తో  ప్రమాదకర షకీబ్ అల్ హసన్ (4)ను వెనక్కుపంపాడు.

16వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన బుమ్రా మరో ఎండ్‌‌లో ధాటిగా ఆడుతున్న శాంటోను ఔట్‌‌ చేయడంతో బంగ్లా పూర్తిగా డీలా పడింది. ఆ వెంటనే అర్ష్‌‌దీప్  బౌలింగ్‌‌లో జాకెర్ అలీ (1) కోహ్లీకి క్యాచ్‌‌ ఇవ్వడంతో 110/6తో  బంగ్లా పులుల పరాజయం ఖాయమైంది.  వెంటవెంటనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు కొట్టిన రిషద్‌‌ హుస్సేన్‌‌, మహ్ముదుల్లా (13) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా:  20 ఓవర్లలో 196/5 (పాండ్యా 50*, కోహ్లీ 37, తంజిమ్ 2/35, రిషద్ 2/43).
బంగ్లాదేశ్‌‌: 20 ఓవర్లలో146/8   (నజ్ముల్ శాంటో 40, తంజిద్ 29, కుల్దీప్‌‌ 3/19, బుమ్రా 2/13).