బెంగళూరు: గాయం నుంచి కోలుకున్న టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కాంపిటీటివ్ క్రికెట్లో రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. రంజీ ట్రోఫీలో కర్నాటక, మధ్యప్రదేశ్ జట్లతో తలపడే బెంగాల్ క్రికెట్ జట్టులో షమీ పేరు లేకపోవడమే ఇందుకు కారణం. బుధవారం నుంచి బెంగళూరులో జరిగే మ్యాచ్‌లో కర్నాటకతో తలపడనున్న బెంగాల్ రంజీ టీమ్.. 13 నుంచి ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో పోటీపడుతుంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా షమీ నెట్స్‌లో పూర్తి స్థాయి బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దాంతో తను కర్నాటకతో రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, బెంగాల్ టీమ్‌లో పేరు లేకపోవడంతో తను మరికొన్ని రోజులు ఎన్సీఏలో ఉండనున్నాడు. షమీ రీఎంట్రీ ఆలస్యం కావడానికి కారణాలు తెలియాల్సి ఉంది.