టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై వేటు పడింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయాల వల్ల అందుబాటులో లేరు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకు రెస్ట్ ఇచ్చారు. ఇలా కీలక ప్లేయర్లు లేకుండా వెస్టిండీస్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా టెస్టు సిరీస్‌లో మెప్పించింది. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం విండీస్ బలమైన టీమ్ కాకపోయినప్పటికీ క్లిష్టమైన కరీబియన్ కండిషన్స్‌లో రెడ్ బాల్ ‘టెస్టు’ పాసయ్యారు.
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
వర్షం కారణంగా రెండో టెస్టులో విజయంతో పాటు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా జట్టు పరంగా ఈ సిరీస్‌లో ఎన్నో సానుకూల ఫలితాలను ఖాతాలో వేసుకుంది. అందులో ముఖ్యమైనది యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎంట్రీ. తొలి టెస్టులో భారీ సెంచరీ కొట్టిన యశస్వి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. శుభ్‌మన్ గిల్ కాకుండా యశస్వితో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సరికొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌ను తీసుకొచ్చాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న జైస్వాల్ ఏకాగ్రత, వయసుకు మించిన పరిణతి చూపెట్టాడు. తొలి టెస్టులోనే 387 బాల్స్ ఎదుర్కొన్న అతను తన బ్యాటింగ్‌లో ఏ చిన్న బలహీనత కనిపించకుండా క్లీన్ షాట్లతో ఆకట్టుకున్నాడు. డిఫెన్స్ నుంచి ఎటాక్ వరకు అన్నింటా మెప్పించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో ఫిఫ్టీ కొట్టిన అతను సెకండ్ ఇన్నింగ్స్‌లో 30 బాల్స్‌లోనే 38 రన్స్ చేసి పరిస్థితి, జట్టు అవసరాలకు తగ్గట్టు ఆటను మార్చుకోగలనని నిరూపించుకున్నాడు. టెక్నిక్, టెంపర్‌మెంట్‌తో పాటు టీమ్ ప్లేయర్‌గా ఆడగలననే నమ్మకం కలిగించిన అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇక, పుజారాపై వేటు వేసిన తర్వాత కీలకమైన మూడో నంబర్ బాధ్యతను జట్టు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. ఫ్యూచర్ స్టార్‌గా భావిస్తున్న గిల్ మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 6, 10, 29* స్కోర్లు మాత్రమే చేసినప్పటికీ అతని సామర్థ్యంపై జట్టుకు అపారమైన నమ్మకం ఉంది. కారు యాక్సిడెంట్‌కు గురైన రిషబ్ పంత్ లేకపోవడంతో ఖాళీ అయిన కీపర్ స్థానంలో ఈ సిరీస్‌లో కేఎస్ భరత్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌కు మేనేజ్‌మెంట్ తొలి అవకాశం వచ్చింది. యశస్వి మాదిరిగా కిషన్ కూడా తొలి సిరీస్‌లోనే మెప్పించాడు. తన కీపింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్న ఈ యంగ్‌స్టర్ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు ఫిఫ్టీతో అచ్చం రిషబ్ పంత్‌ను తలపించాడు. తను ఇదే జోరు కొనసాగిస్తే పంత్ తిరిగొచ్చే వరకూ కీపర్‌గా కొనసాగే చాన్సుంది. అయితే, ఈ ఏడాది చివర్లో సౌతాఫ్రికా టూర్‌లోనే యంగ్‌స్టర్స్‌కు అసలైన పరీక్ష ఎదురవనుంది. అన్రిచ్, రబాడ, ఎంగిడి లాంటి పేసర్లను ఎదుర్కొని నిలబడితే వీళ్లకు తిరుగుండదు.
ALSO READ :రాహుల్ రాజకీయ జీవితంపై స్ట్రేంజ్ బర్డెన్స్ బుక్
ముకేష్ ఓకే.. సిరాజ్ తడాఖా
డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతూ నేషనల్ టీమ్ పిలుపుకోసం ఎదురు చూసిన పేసర్ ముకేశ్ కుమార్ కల ఎట్టకేలకు ఈ సిరీస్‌లో నెరవేరింది. తొందర్లో 30 ఏండ్లకు చేరనున్న ముకేశ్రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. టీమిండియాలో అతడిని లాంగ్‌టర్మ్ ప్లేయర్‌గా చూడొచ్చో లేదో ఇప్పుడే చెప్పలేం. తన బౌలింగ్‌లో ఎక్కువ పేస్ లేకపోయినా.. పదునైన కట్టర్లతో దాన్ని భర్తీ చేస్తున్న అతను ప్రస్తుతానికి మూడో పేసర్‌గా పని కొస్తాడు. ఇక, బుమ్రా, షమీ లేని టైమ్‌లో పేస్ లీడర్‌గా వ్యవహరించిన మహ్మద్ సిరాజ్ వన్డేలతో పాటు రెడ్ బాల్‌లోనూ నంబర్ వన్ బౌలర్‌ను అయ్యే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన సిరాజ్ ఈ ఫార్మాట్‌లో తొలిసారి ప్లేయర్ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కోహ్లీని విపరీతంగా ఆరాధించే సిరాజ్ అతనిలా సూపర్ ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్నాడు. వర్క్‌లోడ్ సమస్య లేకుండా ఫ్లాట్ వికెట్లపై ఇండియాకు వజ్రాయుధంగా మారిపోయాడు. బుమ్రాను గాయాలు వెంటాడటం, షమీకి వయసు మీద పడుతున్న నేపథ్యంలో ఇదే జోరు కొనసాగిస్తే సిరాజ్ తొందర్లోనే టీమిండియా పేస్ లీడర్ కానున్నాడు.
రోహిత్, కోహ్లీ హిట్.. రహానె, జైదేవ్ ఫెయిల్
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తర్వాత కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ కు ఈ సిరీస్ కొంత ఉపశమనాన్ని కలిగించింది. తొలి టెస్టులో సెంచరీ కొట్టిన అతను రెండో మ్యాచ్‌లో రెండు ఫిఫ్టీలతో తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఫారిన్గడ్డపై నాలుగేండ్ల తర్వాత తొలి సెంచరీ కొట్టి అభిమానులను అలరించాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌తో టెస్టు ఫార్మాట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన రహానె తన కెరీర్‌కు కీలకమైన ఈ సిరీస్‌లో 3,8 స్కోర్లతో నిరాశ పరిచాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగొస్తే అతనికి జట్టులో చోటు కష్టమే. ఇక లేటు వయసులో టెస్టు ఎంట్రీ ఇచ్చిన లెఫ్టార్మ్ పేసర్ జైదేవ్ ఉనాద్కట్ రెండు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ లెక్కన జైదేవ్ తన చివరి టెస్టు ఆడేసినట్టే అనొచ్చు.