క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచ ఛాంపియన్ గా ఘనమైన రికార్డ్ ఉంది. 5 సార్లు వరల్డ్ కప్ టైటిల్స్ నెగ్గిన ఆసీస్ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. మిగతా జట్ల సంగతి పక్కన పెడితే ఆసీస్ ని ఓడించాలంటే శక్తికి మించి పోరాడాల్సిందే. కానీ స్వదేశంలో మన ఆటగాళ్లు కంగారూల జట్టుని పసికూన జట్టుని చేసి ఆడిస్తున్నారు. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో ఈజీ విక్టరీ నమోదు చేసిన టీమిండియా.. నిన్న ఇండోర్ లో జరిగిన మ్యాచులో 99 పరుగులతో తేడాతో చిత్తు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు చెలరేగిన ఈ మ్యాచులో టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు సరికొత్త రికార్డులను సెట్ చేసింది.
సిక్సుల్లో టీమిండియానే టాప్
ఈ మ్యాచులో భారత ఇన్నింగ్స్ లో మొత్తం 18 సిక్స్‌లు, 30 ఫోర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో వన్డేల్లో 3000కిపైగా సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా భారత్ అవతరించింది. మొత్తం వన్డే చరిత్రలో భారత్ 3007 సిక్స్‌లతో కొనసాగుతోంది. ఇక 399 పరుగులు చేసిన టీమిండియా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
ఇండోర్ లో అరుదైన రికార్డ్
ఇండోర్ స్టేడియంలో ఇప్పటివరకు భారత్ ఆడిన 7 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇలా ఒక వేదికపై ఓటమి అనేది లేకుండా విజయాలను నమోదు చేసిన నాలుగో జట్టు టీమ్‌ఇండియా. న్యూజిలాండ్ 9 విజయాలు (డునెదిన్ స్టేడియం), పాకిస్థాన్ 8 విజయాలు (బులవాయో), పాకిస్థాన్ 7 విజయాలు (అక్కడి హైదరాబాద్ స్టేడియం). ఈ లిస్టులో టాప్ లో ఉన్నాయి.
వ్యక్తిగత రికార్డులు
ఆరేళ్ళ తర్వాత వన్డేల్లో చోటు సంపాదించిన అశ్విన్.. ఆస్ట్రేలియాపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఆసీస్ పై అశ్విన్ 144 వికెట్లు తీయగా.. ఆసీస్‌పైనే అనిల్ కుంబ్లే 142, పాక్‌పై కపిల్ 141 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బౌలర్లు ఈ మ్యాచులో భారత బ్యాటర్ల ధాటికి పలు చెత్త రికార్డులని నమోదు చేశారు. సూర్య కుమార్ ధాటికి ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సులు సమర్పించుకున్న గ్రీన్ తన పది ఓవర్ల కోటాలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో ఆసీస్ బౌలర్ కామెరూన్ గ్రీన్ (2/103) నిలిచాడు.
ALSO READ : దేవరకొండ ఐస్ బాత్.. సంథింగ్.. సంథింగ్ అంటున్న ఫ్యాన్స్..!
దక్షిణాఫ్రికాపై మిక్ లూయిస్ (2006లో) 0/113), దక్షిణాఫ్రికాపై ఆడమ్ జంపా (0/113) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. యువ ఓపెనర్ గిల్ వన్డేల్లో తొలి 35 ఇన్నింగ్స్ ల్లో ఎక్కువ పరుగులు చేసి ఆల్ టైం రికార్డ్ తన పేరు మీద లిఖించుకున్నాడు.