IND vs ZIM: కుర్రాళ్లకు ఘన స్వాగతం.. జింబాబ్వే చేరుకున్న భారత జట్టు

IND vs ZIM: కుర్రాళ్లకు ఘన స్వాగతం.. జింబాబ్వే చేరుకున్న భారత జట్టు

జూలై 6 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత ఆటగాళ్లు.. జింబాబ్వే చేరుకున్నారు. భారత బృందం రాబర్ట్ గాబ్రియేల్ ముగాబే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టీ20 ప్రపంచకప్ వీరులకు ఘన స్వాగతం.. అంటూ సదరు వీడియోకు క్యాప్షన్ జోడించింది. 

ఆ ముగ్గురెవరో..  

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు స్థానాలను భర్తీ చేసే వీరులు ఎవరనేది మరో వారంలో తేలనుంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, రింకూ సింగ్ వంటి యువ ప్లేయర్లకు జింబాబ్వే పర్యటన గొప్ప అవకాశమని చెప్పుకోవాలి. విదేశీ గడ్డపై సత్తా చాటితే.. సెలెక్టర్ల దృష్టిలో పడవచ్చు. నిలకడగా రాణిస్తే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.

కాగా, బార్బడోస్‌లో హరికేన్(బెరిల్) ప్రభావంతో భారత టీ20 ప్రపంచకప్ జట్టు కరేబియన్ గడ్డపైనే చిక్కకుపోయింది. దాంతో, జింబాబ్వే పర్యటనకు జట్టు‌లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ను తొలి రెండు టీ20ల నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానంలో హర్షిత్ రాణా, జితేశ్ శర్మ, సాయి సుదర్శన్‌లకు చోటిచ్చింది. 

కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఇక, టీ20 ప్రపంచకప్‌తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో జింబాబ్వే పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రధాన కోచ్‌ని త్వరలో నియమించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే ధృవీకరించారు. కొత్త కోచ్‌ ఎవరనేది ఈ నెలాఖరున తేలనుంది.

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.

భారత్ - జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20: జులై 6 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • రెండో టీ20: జులై 7 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • మూడో టీ20: జులై 10 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • నాలుగో టీ20: జులై 13 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)
  • ఐదో టీ20: జులై 14 (హరారే స్పోర్ట్స్ క్లబ్‌)