- సిరాజ్, రాహుల్, గిల్‌కు ప్రమోషన్
- ఐదుగురికి ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. 2024–25 కోసం బుధవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఈ ఇద్దర్ని తొలగించింది. నేషనల్ టీమ్‌లో లేనప్పుడు ఫామ్ కోసం రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఈ ఇద్దరు పట్టించుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంది. అయితే ఏదైనా సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో ఈ ఇద్దర్ని పరిగణనలోకి తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.
మొత్తం 30 మందికి నాలుగు రకాల కేటగిరీలలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కేటాయించింది. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్‌కు కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ లభించగా, కారు యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు డిమోషన్ ఇచ్చారు.
రంజీ ట్రోఫీలో చెలరేగుతున్న చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెను బోర్డు పట్టించుకోలేదు. ఇక సెలెక్షన్ కమిటీ నిర్ణయం మేరకు కొత్తగా ఐదుగురు యంగ్ బౌలర్లకు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆకాశ్ దీప్, విజయ్‌కుమార్ వైశాక్, ఉమ్రాన్ మాలిక్, యష్ దయాల్, విద్వత్ కావేరప్ప ఇందులో ఉన్నారు. గతంలో గ్రేడ్–ఎ+కు రూ. 7 కోట్లు, గ్రేడ్–ఎకు రూ. 5 కోట్లు.. గ్రేడ్– బి, సికి మూడు కోట్లు, కోటి రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. ఈసారి మాత్రం బోర్డు రెమ్యూనరేషన్‌ను ప్రస్తావించలేదు.