- 46కే ఆలౌట్
- టెస్టుల్లో అత్యల్ప స్కోరుతో టీమిండియా చెత్త రికార్డు
- న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కుప్పకూలిన రోహిత్‌సేన
- ఐదుగురు బ్యాటర్లు డకౌట్
- హడలెత్తించిన హెన్రీ, ఒరూర్కె
- దంచిన కాన్వే.. కివీస్ 180/3
సొంతగడ్డపై వరుసగా 18 సిరీస్‌లు గెలిచి జోరుమీదున్నారు. జట్టులో టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఆటగాళ్లున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే హీరోలున్నారు. కానీ, బెంగళూరులో న్యూజిలాండ్ పేసర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఒరూర్కె (4/22) దెబ్బకు మన హీరోలంతా జీరోలయ్యారు. అంతా కలిసి 46 రన్స్‌కే కుప్పకూలారు. చల్లటి వాతావరణంలో కెప్టెన్ రోహిత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొని తప్పు చేయగా.. జట్టులో ఐదుగురు సున్నా చుట్టేశారు. ఫలితంగా స్వదేశంలో అత్యల్ప స్కోరుతో చెత్త రికార్డు మూటగట్టుకున్న ఇండియా అద్భుతం చేస్తే తప్ప బెంగళూరు
టెస్టులో గట్టెక్కడం కష్టమే!
బెంగళూరు: న్యూజిలాండ్‌తో తొలి టెస్టును టీమిండియా అవమానకర రీతిలో ఆరంభించింది. వర్షంతో మొదటి రోజు రద్దయిన తర్వాత గురువారం మొదలైన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అనూహ్యంగా తడబడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా 31.2 ఓవర్లలో 46 రన్స్‌కే కుప్పకూలింది. స్వదేశంలో ఇండియాకు ఇదే లోయెస్ట్ స్కోరు కాగా.. ఓవరాల్‌గా మూడో అత్యల్పం.
కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ డకౌటై నిరాశ పరిచారు. రిషబ్ పంత్ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రెండో రోజు చివరకు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 180/3 స్కోరు చేసింది. డెవాన్ కాన్వే (105 బాల్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 91) వన్డే స్టయిల్లో దంచికొట్టడంతో కివీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం రచిన్ రవీంద్ర (22 బ్యాటింగ్), డారిల్ మిచెల్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. కివీస్ 134 రన్స్ ఆధిక్యంలో ఉంది. అశ్విన్, కుల్దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
15 పరుగుల తేడాతో 7 వికెట్లు
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా తీవ్రంగా నిరాశపరిచింది. చల్లటి వాతావరణంలో కెప్టెన్ రోహిత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. క్రైస్ట్‌చర్చ్ లాంటి పరిస్థితుల్లో, పిచ్ నుంచి లభిస్తున్న మద్దతుతో కివీస్ పేసర్లు ఇండియా నడ్డి విరిచారు. ఏడో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ (2)ను బౌల్డ్ చేసిన టిమ్ సౌథీ కివీస్‌కు బ్రేక్ ఇచ్చాడు.
ఆపై, హెన్రీ, ఒరూర్కె అద్భుతంగా బౌలింగ్ చేయగా...హోమ్‌టీమ్ బ్యాటర్లు జాగ్రత్త పడలేకపోయారు. ఇండియాలో తొలిసారి టెస్టు ఆడుతున్న ఒరూర్కె తన తొలి ఓవర్లోనే గ్లెన్ ఫిలిప్స్పట్టిన సూపర్ క్యాచ్‌తో స్టార్ ప్లేయర్ విరాట్ వికెట్‌తో ఖాతా తెరిచాడు. ఫిట్‌గా లేని గిల్ ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తన మూడో బాల్‌కే షాట్‌కు ట్రై చేసి కాన్వేకు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. ఈ దశలో రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ (13) జాగ్రత్తపడ్డారు. దాంతో 31/3తో ఇండియా నెమ్మదిగా పుంజుకునేలా కనిపించింది.
కానీ, హెన్రీ, ఒరూర్కె మరోసారి విజృంభించగా.. 15 రన్స్ తేడాతో ఆతిథ్య జట్టు చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. 21వ ఓవర్లో ఒరూర్కె షాట్ వైడ్ బాల్‌ను వెంటాడిన జైస్వాల్.. అజాజ్‌కు చిక్కాడు. తన తర్వాతి ఓవర్లోనే లోకల్ స్టార్ రాహుల్‌ను ఒరూర్కె డకౌట్ చేయగా.. హెన్రీ బౌలింగ్‌లో జడేజా కూడా సున్నాకే వెనుదిరిగాడు. 34/6తో లంచ్ బ్రేక్‌కు వెళ్లొచ్చిన తొలి బాల్‌కే అశ్విన్‌ను హెన్రీ గోల్డెన్ డకౌట్ చేశాడు.
ఒంటరి పోరాటం చేస్తున్న పంత్‌ను కూడా అతనే వెనక్కు పంపాడు. ఐదు బాల్స్ తర్వాత ఒరూర్కె బౌలింగ్‌లో బుమ్రా (1) పెవిలియన్ చేరగా.. సిరాజ్ (4 నాటౌట్) కలిసి ఐదు ఓవర్లు క్రీజులో నిలిచిన కుల్దీప్ (2)ను ఔట్ చేసిన హెన్రీ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో పాటు ఇండియా ఇన్నింగ్స్ ముగించాడు.
కాన్వే ధనాధన్
ఇండియా చేతులెత్తేసిన పిచ్‌పై న్యూజిలాండ్ అదరగొట్టింది. ఓ ఎండ్‌లో కెప్టెన్ లాథమ్ (15) జాగ్రత్తగా ఆడుతూ సపోర్ట్ ఇవ్వగా మరో ఓపెనర్ కాన్వే భారీ షాట్లతో ఇండియా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. పేసర్లతో పాటు స్పినర్ల బౌలింగ్‌లో స్వేచ్ఛగా ఆడిన చేసిన అతను అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్‌తో 54 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో లాథమ్‌ను ఎల్బీ చేసిన కుల్దీప్ తొలి వికెట్‌కు 67 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు.
అయినా కాన్వే వెనక్కు తగ్గలేదు. 82/1తో ట్రీ బ్రేక్‌కు వెళ్లొచ్చిన తర్వాత విల్ యంగ్ (33)తో కలిసి స్కోరు వంద దాటించాడు. ఈ క్రమంలో జడేజా వరుస ఓవర్లలో కాన్వే, యంగ్ ఇచ్చిన క్యాచ్‌లను కెప్టెన్ రోహిత్ డ్రాప్ చేయడం ఆతిథ్య జట్టును మరింత దెబ్బతీసింది. చివరకు జడ్డూ బౌలింగ్‌లోనే యంగ్ ఔటయ్యాడు. అదే ఓవర్లో కాన్వేను స్టంపౌట్ చేసే చాన్స్‌ను పంత్ మిస్ చేశాడు.
ఈ క్రమంలో బాల్ మోకాలికి బలంగా తగలడంతో గాయపడ్డ పంత్ గ్రౌండ్ వీడగా.. ధ్రువ్ జురెల్ సబ్‌స్టిట్యూట్ కీపర్‌గా వచ్చాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కాన్వే.. అశ్విన్ ఫుల్ లెంగ్త్ బాల్‌ను రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో బౌల్డ్ అవ్వడంతో ఇండియాకు కీలక బ్రేక్ లభించింది. అయితే, డారిల్, రచిన్ మరో వికెట్ పడకుండా రోజు ముగించారు.
1 సొంతగడ్డపై ఇండియాకు ఇదే లోయెస్టు స్కోరు. 1987లో ఢిల్లీలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 75 రన్స్‌కే ఆలౌటైన రికార్డు బ్రేక్ అయింది. ఆసియా గడ్డపై ఓ టెస్టు టీమ్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.ఇండియా ఇన్నింగ్స్‌లో డకౌటైన బ్యాటర్లు. ఒక ఇన్నింగ్స్‌లో టాప్8 బ్యాటర్లలో ఐదుగురు డకౌట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే.5
ఇండియా 15 రన్స్ తేడాతో 7 వికెట్లు చేజార్చుకుంది. 2017లో ఆస్ట్రేలియాపై 11 రన్స్ తేడాతో ఆఖరి 7 వికెట్లు కోల్పోయింది.15
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 31.2 ఓవర్లలో
46 ఆలౌట్ (పంత్ 20, జైస్వాల్ 13, హెన్రీ 5/15, ఒరూర్కె 4/22).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 180/3 (కాన్వే 91, రచిన్ 22 బ్యాటింగ్, డారిల్ మిచెల్ 14 బ్యాటింగ్, జడేజా 1/28).
టెస్టుల్లో ఇండియా లోయెస్ట్ స్కోర్లు
స్కోరు ప్రత్యర్థి గ్రౌండ్ ఏడాది
36 ఆస్ట్రేలియా అడిలైడ్ 2020
42 ఇంగ్లండ్ లార్డ్స్ 1974
46 న్యూజిలాండ్ బెంగళూరు 2024
58 ఆస్ట్రేలియా బ్రిస్బేన్ 1947
58 ఇంగ్లండ్ మాంచెస్టర్ 1952