Team India: టీమిండియా విక్టరీ పరేడ్.. జనసంద్రమైన ముంబై

Team India: టీమిండియా విక్టరీ పరేడ్.. జనసంద్రమైన ముంబై

టీ20 ప్రపంచకప్‌ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్‌ సేనకు ముంబై ప్రజలు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో భారత జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది. టీమిండియా ప్రయాణించిన విస్తారా విమానం రన్‌వేపై ఉండగా.. ఎయిర్‌పోర్టు అధికారులు విజయోత్సవ కవాతు నిర్వహించారు. కార్లను వరుస క్రమంలో పోనిస్తూ.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ విమానాన్ని ముందుకు సాగనిచ్చారు. అనంతరం అగ్నిమాపక దళం గ్రాండ్ వాటర్ సెల్యూట్ అందించింది.

ఆపై ఎయిర్ పోర్టు నుంచి భారత్ బృందం ప్రత్యేక బస్సులో మెరైన్ డ్రైవ్‌కు బయలుదేరింది. దీనికి 'విజయ్‌రథ్‌'గా నామకరణం చేశారు. భారత క్రికెటర్లు ప్రయాణించిన 'విజయ్‌రథ్‌' ఒకానొక సమయంలో జనాల్లో చిక్కుకుంది. ఆ స్థాయిలో అభిమానులు విచ్చేశారు. పోలీసు సిబ్బంది గుంపును చెదరగొట్టి బస్సు మెరైన్ డ్రైవ్‌కు చేరుకునేలా చేశారు. విమానాశ్రయం మొదలు మెరైన్ డ్రైవ్‌, వాంఖడే స్టేడియం వరకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. లక్షలాది మందితో ముంబై తీరం జనసంద్రంగా మారిపోయింది. టీవీల్లో చూసేవారు ఆ జనాన్ని చూసి నోరెళ్లబెట్టారంటే నమ్మాలి.

విక్టరీ పరేడ్ షురూ.. 

పొట్టి ప్రపంచకప్ వీరులను చూసేందుకు అభిమానులు భారీగా విచ్చేయడంతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన విజయోత్సవ రాత్రి 7:40 నిమిషాల సమయంలో మొదలైంది. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగుతూ అభిమానులతో కలిసి విజయాన్ని జరుపుకున్నారు.

ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు గౌరవంగా నిర్వహిస్తున్న విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విక్టరీ పరేడ్‌లో క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పరేడ్‌ కోసం ముంబై వాసులు భారీగా రోడ్లపైకి వచ్చేశారు. అందునా, వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లను సన్మానించే కార్యక్రమానికి ఉచిత ప్రవేశం ఉండటంతో.. భారీగా అభిమానులు తరలివచ్చారు.