T20 World Cup 2024: రోహిత్, విరాట్ భార్యలు ఒత్తిడిలోకి నెడుతున్నారు: సౌరవ్ గంగూలీ

T20 World Cup 2024: రోహిత్, విరాట్ భార్యలు ఒత్తిడిలోకి నెడుతున్నారు: సౌరవ్ గంగూలీ

టీమిండియా పొట్టి ప్రపంచకప్ ఆటకు సమయం ఆసన్నమైంది. బుధవారం(జూన్ 05) గ్రూప్‌ `ఎ` లో భాగంగా రోహిత్ సేన.. ఐర్లాండ్‌తో తలపడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ.. భారత జట్టు గురించి, ఆటగాళ్ల సతీమణుల గురుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2013 తరువాత భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. ధోనీ అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టినా ఫలితం మాత్రం మారలేదు. 2014 టీ20 వరల్డ్ కప్, 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్, 2019 టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్, 2023 టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్.. ఇలా అన్నింటా వ్యతిరేక ఫలితాలే. వీటిలో కొన్నింటిలో మంచి ఆరంభాన్ని అందుకున్నా.. ఆఖరిలో ఒత్తిడికి తలొచ్చి చిత్తయ్యారు. ఇప్పుడైనా ఆ కోరిక నెరవేరుతుందా..! అంటే మరోసారి అలాంటి భయమే వెంటాడుతోంది. అందుకు కారణం ఆటగాళ్ల సతీమణులని గంగూలీ వివరణ ఇచ్చారు.

"ద్రవిడ్ అత్యుత్తమ ఆటగాడు. అతనికి ఉన్న క్రికెట్ పరిజ్ఞానం అత్యద్భుతం. అతనికి ఏదైనా సలహా ఇవ్వగలిగితే అతిగా ఆలోచించవద్దని చెప్తాను. ఐసీసీ టోర్నీల్లో అతిగా ఆలోచించడం అనర్థం. స్వేచ్ఛగా ఉండాలి. స్టేడియానికి విచ్చేసినప్పుడు రోహిత్ భార్య (రితికా) మోహంలో ఎన్నడూ ప్రశాంతంగా కనిపించలేదు. ఆమె కళ్లల్లో తీవ్రమైన ప్రెషర్ కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ భార్య(అనుష్క) అంతే. తీవ్రమైన ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటుంది. భారత క్రికెటర్లు చేసే అతి పెద్ద తప్పు ఇదే. కుటుంబసభ్యులు కళ్లముందు టెన్షన్ పడుతూ కూర్చుంటే మైదానంలో ఉన్న ప్లేయర్లు ప్రశాంతంగా ఎలా ఉంటారు. వీరిని చూసి వారూ ఒత్తిడికి లోనవుతారు."
 
"ఉదాహరణకు 2003 వన్డే ప్రపంచకప్ తీసుకోండి. ఫైనల్‌లో ఓడినప్పటికీ, నేను భారత్‌నే అత్యుత్తమ జట్టుగా చెబుతాను. ఆరంభంలో మనం అద్భుతమైన క్రికెట్‌ ఆడాము. వరుస విజయాలు సాధించాం. చివరకు వచ్చేసరికి ఒత్తిడికి తలొంచాము. ఓడిపోయాం. ఫైనల్ మ్యాచ్‌లో కాస్త ప్రశాంతంగా ఉండి ఉంటే, రిజల్ట్ మరోలా ఉండేది. అందువల్ల మనపై ఎక్కువ ఒత్తిడి తెచ్చుకోవద్దు..' అని గంగూలీ రివ్‌స్పోర్ట్జ్‌తో అన్నారు.

  • మ్యాచ్: ఇండియా vs ఐర్లాండ్
  • వేదిక: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(న్యూయార్క్) 
  • సమయం: రాత్రి 8 గంటలకు.
  • ప్రత్యక్ష ప్రసారాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్ స్టార్