బంగ్లాను పడగొట్టాలె..నేడు బంగ్లాదేశ్‌‌‌‌తో టీమిండియా మ్యాచ్‌‌‌‌

బంగ్లాను పడగొట్టాలె..నేడు బంగ్లాదేశ్‌‌‌‌తో టీమిండియా మ్యాచ్‌‌‌‌
  •     శుభారంభమే లక్ష్యంగా బరిలోకి
  •     మ. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌18, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

దుబాయ్‌ ‌‌‌: ముచ్చటగా మూడోసారి చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా మెగా టోర్నీలో తొలి సవాల్‌‌‌‌కు రెడీ అయింది. గ్రూప్‌‌‌‌–ఎలో భాగంగా ఇక్కడి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరిగే తమ మొదటి మ్యాచ్‌‌‌‌లో  అంచనాలకు అందని బంగ్లాదేశ్‌‌‌‌తో పోటీ పడనుంది. బంగ్లాను పడగొట్టి టోర్నీలో శుభారంభం చేయడమే టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. గత చరిత్ర .. ఇటీవల ఫామ్‌‌‌‌, ముఖాముఖీ రికార్డు చూస్తే.. బంగ్లాకు ఇండియా అందనంత దూరంలో నిలిచింది. 

స్టార్లు, సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్లు, సీనియర్లు, యంగ్‌‌‌‌స్టర్లతో కూడిన మన జట్టే అత్యంత బలంగా ఉంది. కానీ, బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి లేదు.  చిన్న జట్టే అయినా.. బంగ్లా పులులు  ఎప్పుడు ఎలా ఆడుతారో తెలియదు. ఐదు నెలల కిందట ఆసియా కప్‌‌‌‌లో మనల్ని ఓడించారు. 2022లో తమ దేశంలో వన్డే సిరీస్‌‌‌‌లోనూ ఇండియాపై గెలిచారు. మొత్తంగా ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో ఆ జట్టే మూడుసార్లు నెగ్గింది. 

పైగా, లీగ్ స్టేజ్‌‌‌‌లో ఒక్క ఓటమి మొత్తం సమీకరణాలనే మార్చగలదు.  ఈ నేపథ్యంలో రోహిత్‌‌‌‌ సేన బంగ్లాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకుండా ఆడాల్సి ఉంటుంది. ఇందులో నెగ్గితే ఆదివారం పాకిస్తాన్‌‌‌‌తో మెగా ఫైట్‌‌‌‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చు.

సెలెక్షన్ ట్రబుల్స్‌‌‌‌

ఇంగ్లండ్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసి సూపర్ కాన్ఫిడెన్స్‌‌‌‌తో దుబాయ్‌‌‌‌ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా బ్యాటింగ్‌‌‌‌లో అత్యంత బలంగా ఉంది. ఓపెనర్ శుభ్‌‌‌‌మన్ గిల్, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌ సూపర్ ఫామ్‌‌‌‌లో ఉండగా.. ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌పై సెంచరీతో రోహిత్‌‌‌‌, ఫిఫ్టీతో కోహ్లీ టచ్‌‌‌‌లోకి వచ్చారు. వీళ్లు  సత్తా చాటితే జట్టుకు తిరుగుండదు. అయితే, తుది జట్టు ఎంపికనే కోచ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌కు సమస్యగా మారింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌‌‌‌పైనే చర్చ నడుస్తోంది. తను ఐదో నంబర్‌‌‌‌‌‌‌‌లో వస్తాడా? లేదా అక్షర్‌‌‌‌‌‌‌‌కు ఆ ప్లేస్ అప్పగించి ఆరో నంబర్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతాడా? అన్నది తేలాలి. 

ఇంగ్లండ్‌‌‌‌తో రెండు వన్డేల్లో ఆరో ప్లేస్‌‌‌‌లో వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ చివరి మ్యాచ్‌‌‌‌లో ఐదో స్థానంలో సత్తా చాటాడు. ఆ ప్లేస్‌‌‌‌లోనే తనకు మంచి రికార్డుంది. అయితే, మ్యాచ్ పరిస్థితి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌‌‌‌తో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌‌‌‌మెంట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ పోరులో ఇండియా ముగ్గుర్లు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. స్పిన్‌ విభాగంపై భారీ అంచనాలున్నాయి. జడేజా, అక్షర్ ఆటోమేటిక్ చాయిస్ కాగా.. మూడో స్పిన్నర్ కోటా కోసం కుల్దీప్ యాదవ్‌‌‌‌, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది. ప్రాక్టీస్ సెషన్స్‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

కానీ, ఇటీవల ఫామ్‌‌‌‌ చూసుకుంటే మిస్టరీ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తికి మొగ్గు ఉండొచ్చు. ఇక జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఇండియా పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన షమీ పేస్ విభాగాన్ని ఎలా నడిపిస్తాడన్నది జట్టుకు కీలకం కానుంది. యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ హర్షిత్ రాణాతో పోటీ ఉన్నప్పటికీ బౌలింగ్‌‌‌‌లో మంచి వైవిధ్యం చూపిస్తున్న  లెఫ్టార్మ్‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్.. షమీతో కలిసి కొత్త బాల్‌‌‌‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. అక్షర్‌‌‌‌‌‌‌‌, జడేజాతో పాటు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా బౌలింగ్‌‌‌‌తో పాటు బ్యాటింగ్‌‌‌‌లోనూ రాణించాలని జట్టు కోరుకుంటోంది. 

పిచ్‌‌‌‌/వాతావరణం

ఈ టోర్నీ కోసం దుబాయ్‌‌‌‌లో కొత్త వికెట్లను తయారు చేశారు. మొదట్లో పేసర్లకు.. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు అనుకూలించే చాన్సుంది. రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకం కానుంది. ఇక దుబాయ్‌‌‌‌లో వాతావరణం పొడిగా ఉంది. గురువారం ఆకాశం మేఘావృతం కానున్నా  వర్ష సూచన లేదు.

వాళ్లు కాస్త బలహీనంగానే

ఐసీసీ టోర్నీల్లో సంచలనాలు సృష్టించే జట్టుగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్‌‌‌‌.. టీమిండియాతో పోటీ అనగానే చాలా కసిగా ఆడుతుంది. పైగా, ఆసియా జట్టు కావడంతో ఇక్కడి వాతావరణం ఆ జట్టుకు కూడా సరిపోతుంది. కానీ, ఇటీవల వన్డే ఫార్మాట్‌‌‌‌లో అంతగా ఆకట్టుకోవడం లేదు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌ చేతిలో వైట్‌‌‌‌వాష్‌‌‌‌కు గురైనా బంగ్లా టైగర్స్‌‌‌‌... అంతకుముందు అఫ్గాన్‌‌‌‌ చేతిలోనూ సిరీస్ కోల్పోయారు. పైగా, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో ఆ టీమ్‌‌‌‌ మరింత డీలా పడింది. 

కానీ, కెప్టెన్‌‌‌‌నజ్ముల్ శాంటో, మహ్ముదుల్లా, ముష్ఫికర్ రహీమ్ వంటి సీనియర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లకు తోడు ముస్తాఫిజుర్, తస్కిన్ వంటి నాణ్యమైన పేసర్లు ఆ జట్టు సొంతం.  మెహిదీ మిరాజ్, నహిద్‌ రాణా, తౌహిద్ ఇటీవల కాలంలో  బాగా ఆడుతున్నారు. టీమ్‌‌‌‌లో ఎక్కువ మంది ఆల్‌‌‌‌రౌండర్లు ఉండటం ఆ టీమ్‌కు ప్లస్‌ పాయింట్‌. బంగ్లా బ్యాటర్లు స్పిన్‌ను మెరుగ్గా ఆడగలరు. ఆ టీమ్‌ బౌలర్లతో ఎక్కువ ముప్పు ఉంటుంది  కాబట్టి ఇండియా అజాగ్రత్త వహించకూడదు. 

తుది జట్లు (అంచనా)

ఇండియా : రోహిత్ (కెప్టెన్‌‌‌‌), గిల్, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌, కేఎల్ రాహుల్ (కీపర్), అక్షర్‌‌‌‌‌‌‌‌, పాండ్యా, జడేజా, ల్దీప్‌‌‌‌/చక్రవర్తి, షమీ, అర్ష్‌‌‌‌దీప్. 

బంగ్లాదేశ్‌ ‌‌‌: తంజిద్ హసన్,  సౌమ్య సర్కార్, నజ్ముల్ శాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్‌‌‌‌ (కీపర్‌‌), తౌహిద్ హృదయ్‌,  మహ్ముదుల్లా, మెహిదీ మిరాజ్, రిషద్, తస్కిన్, ముస్తాఫిజుర్, నహిద్ రాణా.