రాజ్‌కోట్ : టీ20 వరల్డ్ కప్ నెగ్గినప్పటి నుంచి ఆడిన 17 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించి షార్ట్ ఫార్మాట్‌లో సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తున్న టీమిండియా మరో సిరీస్‌పై గురి పెట్టింది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో హైదరాబాదీ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్‌తో విజయాలు అందుకున్న జట్టు అదే ఊపులో ఇంగ్లండ్‌ను ముచ్చటగా మూడోసారి ఓడించేందుకు సిద్ధం అయింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌లో గెలిచి రాజ్‌కోట్‌లోనే సిరీస్ నెగ్గాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
అదే సమయంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి వచ్చి తన మార్కు షాట్లతో అభిమానులను అలరించాలని ఆశిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఇంగ్లండ్ ఈ పోరులో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని చూస్తోంది. అందుకోసం అన్ని విభాగాల్లో సత్తా చాటాలని ఆశిస్తోంది. రాజ్‌కోట్‌లోని ఫ్లాట్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఈ మ్యాచ్‌లో పరుగుల మోత మోగే అవకాశం ఉంది. అయితే, రాత్రి పూట మంచు ప్రభావం దృష్ట్యా టాస్ కీలకం కానుంది.
సూర్య ఫామ్‌పై ఫోకస్
సూర్యకుమార్ గతేడాది టీ20 కెప్టెన్సీ అందుకున్నప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో ఇండియా సూపర్‌గా ఆడుతోంది. కానీ, టీ20ల్లో వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా పేరొందిన సూర్య ఆటగాడిగా నిరాశపరుస్తున్నాడు. గత17 ఇన్నింగ్స్‌ల్లో 26.81 సగటుతో 429 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ ఫెయిలయ్యాడు. తిలక్ వర్మ అద్బుత ఆటతో చెన్నైలో ఇండియా గట్టెక్కినా.. సూర్యకుమార్ ఫెయిల్యూర్‌తో పాటు, సంజూ శాంసన్ షార్ట్‌బాల్‌కు ఔటయ్యే బలహీనతను బయటపెట్టడం వంటి లోపాలు స్పష్టం కనిపించాయి.
సౌతాఫ్రికాలో వరుసగా రెండు సెంచరీలతో అదరగొట్టిన శాంసన్ ఈ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్స్‌కు రెండుసార్లు ఔటయ్యాడు. రాజ్‌కోట్‌లో ఫ్లాట్ వికెట్‌పై అయినా ఈ బలహీతను సరిదిద్దుకోవడంపై శాంసన్ ఫోకస్ పెట్టాలి. ఇక, 2023లో ఇదే గ్రౌండ్‌లో శ్రీలంకపై సూర్య తన తొలి టీ20 సెంచరీ కొట్టాడు. అతను తిరిగి ఫామ్ అందుకునేందుకు ఇదే సరైన వేదిక అనొచ్చు. సూపర్ ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. , గాయాల కారణంగా రింకూ సింగ్, నితీష్ రెడ్డి జట్టుకు దూరమవ్వడంతో చెన్నైలో బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ ఫెయిలయ్యాడు.
ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో శివం దూబే, రమణ్‌దీప్ సింగ్‌లో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. అర్ష్‌దీప్‌తో కలిసి బౌలింగ్ ఆరంభిస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ బ్యాట్‌తోనూ మెరవాల్సిన అవసరం ఉంది. ఇండియా స్పిన్నర్లు గత రెండు మ్యాచ్‌ల్లోనూ సూపర్ పెర్ఫామెన్స్ చేశారు. అదే జోరును కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు.
స్పిన్‌కు బదులు ఇస్తారా?
ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తమ పేరుకు తగ్గట్టు ఆడటంలేదు. తొలి పోరులో తేలిపోయిన బట్లర్‌సేన చెపాక్‌లో బౌలింగ్‌లో ఆకట్టుకున్నా తిలక్ వర్మను ఆపలేక ఓడిపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆ జట్టు తీవ్రంగా తడబడుతోంది. కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. మిగతా ప్లేయర్లు ఇండియా స్పిన్నర్ల ముందు తేలిపోతున్నారు. జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ గత మ్యాచ్‌లో కాసేపు పోరాడారు. కానీ, ఇంగ్లండ్ గెలవాలంటే మిగతా వాళ్లు కూడా రాణించాల్సి ఉంటుంది. ఓపెనర్లు డకెట్, ఫిల్ సాల్ట్ శుభారంభం అందిస్తేనే ఆతిథ్య జట్టుకు బట్లర్‌సేన పోటీ ఇవ్వగలదు.
మిడిలార్డర్‌లో భారీ అంచనాలున్న బ్రూక్, లివింగ్‌స్టోన్ గాడిలో పడాలని ఆ జట్టు కోరుకుంటోంది. బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్ టీమ్‌లో సమస్యలు ఉన్నాయి. స్టార్ పేసర్ ఆర్చర్ చెన్నైలో ఏకంగా 60 రన్స్ ఇచ్చుకున్నాడు. మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న ఆర్చర్ వికెట్లు పడగొట్టడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్ ఆదిల్ రషీద్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలర్లు కూడా అతనికి సహకారం అందిస్తేనే ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ రేసులో నిలవగలదు. రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఇంగ్లండ్ రాజ్‌కోట్‌లోనూ బరిలోకి దిగనుంది.