- గిల్, రోహిత్ సెంచరీలు
- తొలి ఇన్నింగ్స్‌లో 473/8
- ఇప్పటికే 255 రన్స్ ఆధిక్యం
- మెరిసిన సర్ఫరాజ్, పడిక్కల్
ధర్మశాల: చేతిలో మరో రెండు వికెట్లు ఉండగా ఇప్పటికే 255 రన్స్ ఆధిక్యం సాధించింది. రోహిత్, గిల్ రెండో వికెట్‌కు 171 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌తో విజయానికి పునాది వేయగా, మిడిలార్డర్‌లో అరంగేట్రం ఆటగాడు దేవదత్ పడిక్కల్ (63), సర్ఫరాజ్ ఖాన్ (56) ఫిఫ్టీలతో సత్తా చాటారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (27 బ్యాటింగ్), జస్‌ప్రీత్ బుమ్రా (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బషీర్ నాలుగు, హార్ట్‌లీ రెండు వికెట్లు తీశారు. కుల్దీప్, బుమ్రా ఇండియా ఆధిక్యాన్ని 300 దాటిస్తే జట్టు మరోసారి బ్యాటింగ్‌కు రాకుండానే 4–-1తో సిరీస్‌ను కైవసం చేసుకునే చాన్సుంది.
రోహిత్–గిల్ జిగేల్
ఓవర్‌నైట్ స్కోరు 135/1తో ఇండియా ఆట కొనసాగించగా, రోహిత్, గిల్ క్లాసిక్ బ్యాటింగ్‌తో భారీ స్కోరుకు బాటలు వేశారు. ఉదయం మంచి ఎండ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ తొలి సెషన్‌లో ప్రత్యర్థి స్కోరును దాటించి జట్టును ఆధిక్యంలోకి తెచ్చారు. వీళ్లను ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ చాలా ప్రయత్నాలు చేసింది. బషీర్ బౌలింగ్‌లో రోహిత్‌కు లెగ్ స్లిప్ ఫీల్డర్‌ను పెట్టినా, లెగ్ సైడ్‌లో ఆరుగురు ఫీల్డర్లను ఉంచి మార్క్ వుడ్ షార్ట్ బాల్‌తో పరీక్ష పెట్టినా ఫలితం లేకపోయింది.
తొలుత కుదురుకునేందుకు చెరో ఓవర్ తీసుకున్న రోహిత్, గిల్ తర్వాత తమ బ్యాట్లకు పని చెప్పారు. ఉదయం బౌలింగ్ ప్రారంభించిన స్పిన్నర్ బషీర్‌తో పాటు పేసర్ అండర్సన్‌ను రోహిత్ ఒత్తిడిలోకి నెట్టాడు. ముఖ్యంగా అండర్సన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్స్, ఫోర్‌తో జోరు పెంచాడు. గిల్ కూడా మంచి షాట్లతో అలరించాడు. అండర్సన్ బౌలింగ్‌లో రెండు అడుగులు ముందుకొచ్చి స్ట్రెయిట్ సిక్స్ కొట్టిన అతను స్క్వేర్ కట్ షాట్‌తో మరో సిక్స్ రాబట్టాడు.
లెగ్ స్లిప్‌లో ఇచ్చిన జాక్ క్రాలీ వదిలేయడంతో రోహిత్‌కు లైఫ్ దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న హిట్ మ్యాన్... ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ షార్ట్ బాల్ ప్లాన్‌ను తిప్పికొట్టాడు. ఈ క్రమంలో టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో సింగిల్‌తో టెస్టుల్లో తన 12వ సెంచరీ పూర్తి చేసుకోగా.. వెంటనే బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి గిల్ కూడా వంద దాటాడు. దాంతో ఇండియా 264/1తో లంచ్‌కు వెళ్లింది.
కుర్రాళ్ల జోరు
బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాజిక్ బాల్‌తో రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మోకాలి గాయం తర్వాత దాదాపు తొమ్మిది నెలల గ్యాప్ అనంతరం బౌలింగ్ చేసిన స్టోక్స్ తన తొలి బాల్‌కే వికెట్ తీయడం విశేషం. తర్వాతి ఓవర్లోనే పదునైన బాల్‌తో గిల్‌ను బౌల్డ్ చేయడంతో ఇండియా 279/3తో నిలిచింది. వరుసగా రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ రేసులోకి వచ్చేలా కనిపించింది.
కానీ, ఇండియా యంగ్‌స్టర్స్ సర్ఫరాజ్, పడిక్కల్ ఆ చాన్స్ ఇవ్వలేదు. పడిక్కల్ తన ఆఫ్‌సైడ్ గేమ్‌తో అదరగొట్టాడు. బ్యాక్ ఫుట్ పంచ్‌లు, కవర్ డ్రైవ్స్‌తో బౌండ్రీలు కొడుతూ ప్రేక్షకులను అలరించగా... మరో ఎండ్‌లో సర్ఫరాజ్ నెమ్మదిగా వేగం వేగం పెంచాడు. బషీర్ బౌలింగ్‌లో రెండు సార్లు స్వీప్ షాట్లతో బౌండ్రీలు కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన షార్ట్ బాల్‌ను లాఫ్టెడ్ షాట్‌తో సిక్స్ కొట్టిన అతను మరో బౌన్సర్‌ను ర్యాంప్ షాట్‌తో బౌండ్రీ చేర్చి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. అయితే, మూడో సెషన్‌లోనే వెంటవెంటనే ఐదు వికెట్లు తీసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు ఇండియా స్పీడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు.
బషీర్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడిన సర్ఫరాజ్ ఫస్ట్ స్లిప్‌లో రూట్‌కు సింపుల్ క్యాచ్ ఇవ్వగా, పడిక్కల్ లైన్ మిస్సయి బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే ధ్రువ్ జురెల్ (15)ను సైతం బషీర్ వెనక్కుపంపగా, తర్వాతి ఓవర్లోనే ఆల్‌రౌండర్లు జడేజా (15), అశ్విన్ (0)ను హార్ట్‌లీ పెవిలియన్ చేర్చాడు. దాంతో 428/8తో నిలిచిన ఇండియా ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, చివర్లో కుల్దీప్, బుమ్రా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 18 ఓవర్ల పాటు మెరుగ్గా ఆడిన ఈ ఇద్దరూ మరో వికెట్ పడకుండా రోజు ముగించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్; ఇండియా తొలి ఇన్నింగ్స్: 120 ఓవర్లలో 473/8 (గిల్ 110, రోహిత్ 103, బషీర్ 4/170, హార్ట్‌లీ 2/126).